పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో ‘తమ్ముడు’ ఒకటి. హిందీ చిత్రం ‘జో జీతా వోహి సికిందర్’ ఆధారంగా కొత్త దర్శకుడు అరుణ్ ప్రసాద్ ఈ సినిమాను రూపొందించాడు. ఐతే హిందీతో పోలిస్తే తెలుగులో మార్పులుంటాయి. ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది. ఒరిజనల్ నచ్చి పవన్ సైతం కొంత మేర క్రియేటివ్ సైడ్ అరుణ్ ప్రసాద్‌కు సాయం చేసి ఈ సినిమా తెలుగులో ఇంకా మెరుగ్గా తయారవడంతో తన వంతు కృషి చేశాడు.
విశేషం ఏంటంటే.. మరో మెగా హీరో అల్లు అర్జున్‌కు హిందీలో ఆల్ టైం ఫేవరెట్ సినిమా ఇదేనట. తాజాగా ఓ ఇంగ్లిష్ డైలీతో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అతనీ విషయాన్ని వెల్లడించాడు. హిందీలో ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ‘జో జీతా వోహి సికిందర్’ తనకెంతో ఇష్టమైన చిత్రమని.. దాన్ని 20 సార్లకు పైగా చూశానని బన్నీ ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
‘తమ్ముడు’లో పవన్ బాక్సింగ్ నేర్చుకుని విలన్‌తో ఫైట్ చేస్తే.. హిందీలో సైక్లింగ్ నేపథ్యంలో కథ నడుస్తుంది. అక్కడ మన్సూర్ ఖాన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. 1992లో విడుదలైన ఈ చిత్రం అప్పటికి ఆమిర్ ఖాన్ కెరీర్లో బిగ్టెస్ట్ హిట్‌గా నిలిచింది. ఏడేళ్ల తర్వాత తెలుగులో తెరకెక్కి ఇక్కడా మంచి విజయం సాధించింది.
ఇది కాక మరో రెండు హిందీ సినిమాల్ని తాను అమితంగా ఇష్టపడతానని అన్నాడు బన్నీ. అందులో ఒకటి బాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్.. దిల్వాలే దుల్హానియా లే జాయేంగే. ఈ సినిమాను కూడా చాలాసార్లు చూసినట్లు బన్నీ తెలిపాడు. షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా ఆదిత్య చోప్రా రూపొందించిన ఈ చిత్రం కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
ఇక మోడర్న్ హిందీ సినిమాల విషయానికి వస్తే.. గల్లీబాయ్ తనకు చాలా ఇష్టమైన చిత్రమని బన్నీ తెలిపాడు. ఈ సినిమాను కూడా మూణ్నాలుగుసార్లు చూసినట్లు వెల్లడించాడు. ఈ చిత్రాన్ని మెగా హీరోల్లోనే ఒకరితో రీమేక్ చేస్తారని ఆ మధ్య వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.