హను రాఘవపూడితో అఖిల్?

Akhil

అక్కినేని అఖిల్ హీరోగా ఇప్పటికే మూడు సినిమాల్లో నటించాడు. ఆ మూడూ డిజాస్టర్లే అయ్యాయి. ఐతేనేం అతడి కెరీర్ ఏమీ ఆగిపోలేదు. చిన్నప్పుడే ‘అఖిల్’ సినిమాతో అందరి ఫేవరెట్‌గా మారిన అఖిల్.. ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల మనసులు గెలవడానికి గట్టిగానే కష్టపడుతున్నాడు.

గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బేనర్లో ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అతను నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఇంతలోనే స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ‘ఏజెంట్’ సినిమాను లైన్లో పెట్టాడు. దీని తర్వాత అఖిల్ నటించనున్న సినిమాల గురించి కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి.

అందులో ఒకటేంటంటే.. ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడితో అఖిల్ ఓ సినిమా చేయనున్నాడట. సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బేనర్ ఈ చిత్రాన్ని నిర్మించనుందట.

దర్శకుడిగా హనుకు మంచి అభిరుచి ఉంది. అతను భిన్నమైన కథలు ప్రయత్నిస్తుంటాడు. కానీ ఒక కంప్లీట్ మూవీ తీయడంలో మాత్రం తడబడుతుంటాడు. అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ రెండూ కూడా చక్కగా మొదలై.. సగం వరకు బాగానే సాగి.. తర్వాత గాడి తప్పుతాయి. ఐతే ఆ సినిమాలకు ఉన్నంతలో బాగానే ఆడాయి కానీ.. అతడి చివరి రెండు సినిమాలు మాత్రం పెద్ద డిజాస్టర్లయ్యాయి.

లై, పడి పడి లేచె మనసు చిత్రాలు నిర్మాతలకు దారుణమైన నష్టాలు మిగిల్చాయి. అయినా సరే హను మరో మంచి అవకాశం అందుకున్నాడు. వైజయంతి మూవీస్ బేనర్లో దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ సినిమాను పట్టాలెక్కించాడు. ఈ చిత్ర షూటింగ్ మధ్య దశలో ఉంది. ఇంతలోనే తన తర్వాతి సినిమాను అఖిల్‌తో ఓకే చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కంటే ముందు అఖిల్, హను వేర్వేరుగా విజయాలు అందుకుంటే ఈ ప్రాజెక్టుకు మంచి క్రేజ్ వస్తుంది. లేదంటే మాత్రం కష్టమే.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)