లోకనాయకుడు కమల్ హాసన్ కొత్త సినిమా ‘విక్రమ్’ మీద ప్రేక్షకుల్లో ఎంత ఆసక్తి ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నగరం, ఖైదీ, మాస్టర్ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించిన లోకేష్ కనకరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమాను ప్రకటిస్తూ రిలీజ్ చేసిన వీడియోనే అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజల్ లాంటి మేటి నటులు నెగెటివ్ రోల్స్ చేస్తున్నారన్న సమాచారం బయటికి వచ్చాక ఎగ్జైట్మెంట్ మరో స్థాయికి చేరింది.
కాగా ఇప్పుడు ‘విక్రమ్’ గురించి మరో ఆసక్తికర వార్త తమిళ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో కమల్ అంధుడి పాత్రలో కనిపించనున్నాడట. ఐతే సినిమా మొత్తంలో ఆయన అంధుడిగా కనిపించడట. కొంత వరకు మాత్రమే ఆ షేడ్ ఉంటుందట. అలాగే ఆయన పోలీస్‌గానూ కనిపిస్తాడని అంటున్నారు.
కమల్ సినిమాలో అన్నింటికంటే హైలైట్ అయ్యేది ఆయన పెర్ఫామెన్సే. కొంచెం విలక్షణమైన పాత్ర పడిందంటే ఆయనెలా చెలరేగిపోతారో తెలిసిందే. అందులోనూ అంధుడి పాత్ర అంటే కమల్ ఎలా చేస్తాడనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. గతంలో ‘రాజా పార్వై’ (తెలుగులో అమావాస్య చంద్రుడు)లో ఆయన అంధుడిగా అద్భుత అభినయం చూపించాడు. మళ్లీ ఇంత కాలానికి అంధుడి పాత్ర చేస్తున్నాడు.. అది కూడా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో అంటే ప్రత్యేక ఆసక్తి ఉంటుంది.
అంధుడి పాత్రలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజల్ లాంటి విలన్లను కమల్ ఎలా ఢీకొంటాడన్నదీ ఉత్కంఠ రేకెత్తంచే విషయమే. మరి తమిళ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం ఎంత వరకు నిజమో చూడాలి. కొన్ని రోజుల కిందటే ‘విక్రమ్’ షూటింగ్ మొదలైంది. చాన్నాళ్ల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రావడంతో కమల్ చాలా ఎగ్జైట్ అవుతూ ట్విట్టర్లో పోస్టులు పెట్టడం తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates