నీ పని నువ్వు చూసుకో

శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః

ఇది భగవద్గీతలో మూడవ అధ్యాయంలో 35 వ శ్లోకం.

దీని అర్థం: “గొప్పగా ఉందనుకునే ఇతరుల ధర్మం కంటే, గొప్పగా కనిపించకపోయినా తన ధర్మమే మంచిది. ఆ ధర్మం ఆచరిస్తూ చనిపోయినా మంచిదే. అంతే కానీ పరుల ధర్మం ఆచరించడం భయంకరమైనది”

తేలిగ్గానే అర్థమౌతున్నట్టు ఉన్నా ఇక్కడ ధర్మం అంటే ఏమిటి అనేది మొదటి ప్రశ్న.
కొంత మంది కులవృత్తి అని చెప్తారు. కొందరు ఉద్యోగం అంటారు. కానీ నాకు ఇక్కడ ధర్మం అంటే “ప్రవృత్తి” లేదా “స్వభావం” అనడం సరైనదనిపిస్తుంది. సహజంగా మన ప్రవృత్తికి తగ్గ పనులే చెయ్యాలని ఈ శ్లోకం చెప్తుంది. ఎందుకో చూద్దాం.

అందరికీ ఆసక్తులు (passions), సామర్థ్యాలు (abilities) ఉంటాయి. రెండూ ఒకచోటే ఉంటే గొడవలేదు. కానీ అది చాలా అరుదు. సాధారణంగా ఆసక్తి ఒక పనిలో ఉంటే, సామర్థ్యం మరో పనికి సంబంధించింది అయి ఉంటుంది.

నాకు తెలిసిన ఒకాయనకి ఏదో ఒక వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలని ఉండేది. దాంతో ఒకసారి చెఱకుగడల వ్యాపారం మొదలు పెట్టాడాయన. ఆసక్తి సంపాదించాలనుకునే డబ్బు మీద తప్ప ఆ వ్యాపారం చేసే శక్తి సామర్థ్యాలు అస్సలు లేవు. వ్యాపారంలో నష్టం వచ్చింది. తర్వాత మరొక వ్యాపారం ఏదో పెట్టి అందులో కూడా దెబ్బతిన్నారు. ఎందులోనూ కలిసి రావట్లేదు కాబట్టి అసలు తాను ఏమి చేయగలరో కూర్చుని ఆలోచించుకున్నారు. తనకి ఏ పని బాగా వచ్చో తెలుసుకున్నాక మద్రాస్ వెళ్లే రైలెక్కారు. ఒక సినిమా ఆఫీసులో అసిస్టెంటుగా చేరి క్రమక్రమంగా నాలుగు రూపాయలు సంపాదించుకుంటూ, ఒక దశలో దర్శకుడయ్యారు. కామెడీ హిట్లు తీసారు. తర్వాత సినిమాలు తగ్గాయి. కానీ అదే రంగాన్ని అంటి పెట్టుకుని యాడ్ ఫిలింస్ లాంటివి చేసుకుంటూ గడుపుతున్నారు. మళ్లీ సినిమా చెయ్యాలనే హోప్ తో కొత్త కథలు రాసుకుంటూ నిత్య చైతన్యంతో ఉంటున్నారు.

ఈ మధ్యన ఆయనతో నేను, “మీకు మంచి రియల్ ఎస్టేట్ మిత్రులు ఉన్నారు కదా. వాళ్లు కూడా మిమ్మల్ని పిలుస్తున్నారని మీరే చెప్పారు. వాళ్లతో చేతులు కలిపితే మంచి సంపాదన వస్తుంది. అప్పుడు మీరే మీ సినిమా తీసుకోవచ్చు కదా నిర్మాతని వెతుక్కోకుండా అన్నాను”.

“సినిమా తియ్యడం తప్ప ఇంకేదీ నాకొద్దు. ప్రస్తుతానికి నేను సంతృప్తిగా ఉన్నాను. మరో సినిమా తీయకుండా నేను పోతానన్నా నాకు రిగ్రెట్ లేదు. నాకు శక్తిలేని రంగంలో నేను వేలు పెట్టను..అక్కడ ఎంత డబ్బొస్తుందన్నా సరే”, అన్నారు.

“మీరు భగవద్గీత చదివారా?” అనడిగాను.

“లేదు. ఏం”? అని అడిగారు.

తర్వాత చెప్తాను అని దాటేసాను. ఇలా భగవద్గీత చదవకపోయినా అందులో ఉన్న సారాంశంతో బతుకుతున్నవాళ్లు నాకు తారసపడుతూనే ఉన్నారు.

ఇది కచ్ఛితంగా ఇక్కడ చెప్పుకుంటున్న గీతాశ్లోక సారాంశమే. ఇంతకీ ఆయన పేరు శివనాగేశ్వర రావు.అలాగే నాకు తెలిసిన మరొక ఆయనకి కూడా ఇలాగే సినిమా రంగం మీద ఆసక్తి. తన సామర్థ్యం మీద తనకి నమ్మకం ఉన్నా ఇంట్లోవాళ్లకి లేదు. అందుకని బలవంతంగా ఒక నిర్మాణ కంపెనీలో ఉద్యోగంలో చేర్చారు. అది తన కప్ ఆఫ్ టీ కాదని వెంటనే గ్రహించాడు ఆయన. ఉద్యోగం మానేసి సినిమాలంటే ఆసక్తి కాబట్టి వీడియో లైబ్రరీ పెట్టుకున్నాడు. క్రమంగా ఆ వ్యాపారంలో ఒక లెవెల్ కి ఎదిగాడు. పరిచయాలతో ఒక హీరోకి కథ వినిపించి డైరెక్టర్ అయ్యాడు. ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా అనతికాలంలోనే దేశం గుర్తించిన పెద్ద దర్శకుడయ్యాడు. ఇప్పటికీ అధిక సంఖ్యలో సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఆయన రాం గోపాల్ వర్మ.

– ఇక నా విషయంలో కూడా నాకు తెలియకుండా ఈ శ్లోకం ప్రధాన భూమిక పోషించింది. అదెలాగో చెప్తాను. మా నాన్నగారు ఒక పదేళ్ళు ఆర్మీలో పని చేసారు. సరిగ్గా ఆఫీసర్ గా ప్రమోషన్ వస్తోందనగా మా బామ్మగారికి ఒంట్లో బాగుండకపోవడం, ఆర్మీ ఉద్యోగం మానేయాలని మా నాన్నగారి మీద ఆవిడ ఒత్తిడి పెంచడం వల్ల ఆయన మిలిటరీ వదిలి వచ్చేసి బ్యాంక్ ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాతే ఆయన పెళ్లి, నేను పుట్టడం జరిగాయి.

– ఇక నన్ను ఆర్మీ ఆఫీసర్ చెయ్యాలనేది ఆయన కోరిక (కొంచెం “దంగల్” సినిమా టైప్ అన్నమాట). నా ఐదో క్లాస్ పూర్తవగానే కోరుకొండ సైనిక్ స్కూల్లో చేర్పించాలని ఆయన ప్రయత్నం. చిన్నపిల్లాడినని మా అమ్మ అడ్డుకుంది.

తర్వాత టెంత్ వరకు మామూలుగానే సాగింది. ఆ తర్వాత అందరూ ఎంసెట్ రాసే ప్రయత్నాలతో రకరకాల కాలేజీల్లో చేరుతుంటే, నన్ను మిలిటరీలో చేరడానికి ట్రైనింగ్ ఇచ్చే ఒక కాలేజీలో చేర్పించి అక్కడ ఇంటర్ చదివించారు. అది పూర్తవగానే రెండు సార్లు ఎన్.డి.ఎ (నేషనల్ డిఫెన్స్ అకాడెమీ) పరీక్షలు రాసి ఒకసారి పాసయ్యి ఎస్.ఎస్.బి ఇంటర్వ్యూ దాకా వెళ్లాను. ఆఖరి రోజు నెగ్గలేక వెనక్కొచ్చాను. మళ్లీ ప్రయత్నించమని ప్రోత్సహించారు.

అలా డిగ్రీ పూర్తయ్యే దాకా మొత్తానికి 7 సార్లు ఎస్.ఎస్.బి ఇంటర్వ్యూలకి వెళ్లాను. డైవర్షన్ లేకుండా ఎన్.సి.సి లో చేరడం కూడా జరిగింది. అయినా కూడా అనుకున్న ఫలితం రాలేదు. ఆఖరి చాన్స్ కూడా మిస్ అయింది. ఏజ్ బార్ అయిపోయింది. ఆర్మీ ఉద్యోగం నాకు రాసిపెట్టలేదు అనుకున్నాను. ఈ ప్రయత్నాల్లో ఎక్కడా కూడా నా అయిష్టత లేదు. చిత్తశుద్ధిగానే ప్రయత్నించాను శారీరకంగా, మానసికంగా కూడా. ప్రయత్నలోపం లేకపోయినా ఎక్కడో సామర్థ్య లోపం వల్ల ఆ ఉద్యోగం రాలేదు అంతే.

తర్వాత గాలివాటంగా ఎం.బి.యే లో చేరాను. చిన్నప్పటి నుంచీ కవిత్వం రాయడం నా ప్రవృత్తి. వ్యాసరచన నా స్వభావం.

అయితే ఎం.బి.ఎ ఫైనల్ ఇయర్లో మా ప్రొఫెసర్ క్లాసులో అందర్నీ ఒక రోజు “పదేళ్ల తర్వాత మీరు మిమ్మల్ని ఎక్కడ చూసుకుంటారు?” అని అడిగారు.
ఒకరు ఫలానా బిజినెస్ పెడతానని, మరొకరు పెద్ద ఎం.ఎన్.సీ లో సీయీవో అవుతానని ఇలా రకరకాలుగా చెప్తున్నారు. నా వంతు వచ్చింది.
“పదేళ్ల తర్వాత సినిమా రంగంలో రచయితగా ఉంటాను” అన్నాను.
కొందరు నవ్వారు.
“మరి ఎం.బి.ఎ ఎందుకు చదివావ్?” అడిగారు ప్రొఫెసర్.
“వీళ్లంతా వేరే వాళ్ల ప్రాడక్టును అమ్ముదామనుకుంటున్నారు. నేను నాలో ఉన్న రచనని అమ్ముదామనుకుంటున్నాను. అది కూడా బిజినెస్సే కదా అన్నాను”.
చప్పట్లు కొట్టారు.
నిజానికి ఏదో తింగరిగా చెప్పాలని చెప్పానే తప్ప ఆ సమయానికి సినిమారంగంలోకి వెళ్లిపోవాలని పెద్ద ఆలోచనేమీ లేదు నాకు. అయితే ఎక్కడో అంతరాల్లో ఉన్న ఆసక్తి నా చేత అలా చెప్పించి ఉండొచ్చు.
సరిగ్గా పదేళ్లకి అదేంటో గానీ నేను మొదటి సారి పాటలు రాసిన సినిమా “స్నేహగీతం” విడులయింది.

అదలా ఉంచితే ఎం.బి.ఎ పూర్తి చేసాక రెండేళ్లల్లో మూడు మార్కెటింగ్ కంపెనీలు మారాను. అస్సలు సంతృప్తి ఉండేది కాదు. 8 గంటల ఉద్యోగమే అయినా మానసికంగా అలిసిపోయేవాడిని.

నా ఆఖరి కంపెనీలో ఒక కొలీగ్ “తెలిసిన ఒకయాన శృంగారం డాట్ కాం అని వెబ్సైట్ పెట్టారు. ప్రాచీన తెలుగు సాహిత్యం మీద వ్యాసాలు రాయాలట. నీకు ఆ సరదా ఉంది కదా. ఒక సారి కలవమని నెంబర్ ఇచ్చారు”.

అంతే, వెంటనే కాల్ చేసి ఆయన్ని కలిసాను. ఆయన పేరు నరేష్. రెండు వ్యాసాలు రాసిచ్చాను. ఆయనకి విపరీతంగా నచ్చాయి. నెలకి రూ 3000/- ఇస్తానన్నారు. అలా నా ప్రవృత్తికి తగిన పని మొదలయింది. నిజానికి 2004లో ఆ రూ3000/- చాలా తక్కువ. అయినా సరే..మనసు హాయిగా ఉండేది స్వభావానికి తగని ఉద్యోగం వదిలేసి ప్రవృత్తికి తగిన ఈ రాతలు రాసుకోవడం.

నా పనితనం చూసి నెలలో నా జీతం రూ 5000/- చేసారు. ఆ వెబ్సైటుకి ప్రముఖ రచయిత మల్లాది వేంకట కృష్ణమూర్తిగారు ఎడిటరుగా వచ్చారు. నా స్వభావం రచన కాబట్టి రచయితలంటే ఫాజినేషన్ సహజంగా ఉండేది. అలా ఆయనతో పని చేయడాన్ని అనుభూతి చెందుతూ ఉండేవాడిని.

ఆర్మీలో చేరనప్పుడు ఏదైనా ఒకటే అనుకున్నారో ఏమో నా తండ్రిగారు నన్ను ఎప్పుడూ కూడా “ఇదేమి ఉద్యోగం రా..” అని గానీ, “ఈ ఉద్యోగంతో నీకు పెళ్లి ఎలా అవుతుంది?” అని గానీ అనలేదు. ఏదో పని ఇష్టంగా చేస్తున్నాడులే…అన్నట్టుగానే ఉండేది ఆయన ధోరణి. ఆ స్వేచ్ఛ నాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది.

ఆ వెబ్సైటులో చేస్తుండగానే ఒక పాపులర్ వెబ్సైటులో రివ్యూలు రాసే ఉద్యోగం కూడా వచ్చింది. క్రమక్రమంగా సినిమా ప్రముఖుల్ని ఇంటర్వ్యూలు చేయడం, పరిచయాలు పెరగడం సంభవించాయి. జర్నలిస్టుగా, కాలమిస్టుగా, సమీక్షకుడిగా ఇలా రకరకాల ప్రొఫైల్స్ ఉన్నా అన్నీ రచనకి సంబంధించినవే. వీటితో పాటు కొన్ని కంపెనీలకి మార్కెటింగ్ రైటప్స్, యాడ్ కాన్సెప్ట్స్ వంటివి ఇంగ్లీష్, తెలుగుల్లో ఇవ్వడం మొదలుపెట్టాను. దానికి నా స్వభావంతో పాటు ఎం.బి.ఎ చదువు ఉపయోగపడింది. ఆ విధంగా నాలుగు రకాల సంపాదన. ఇదంతా ఏడాదిన్నరలో జరిగిపోయింది. రోజుకి 18 గంటలు పని చేసినా అలసట ఉండేది కాదు… ఆనందమే తప్ప. కారణం ప్రవృత్తికి తగిన పని కనుక.

ఈ సినిమా పరిచయాల వల్ల సినిమాల్లో పాటలు రాసే అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతానికి సినిమా స్నేహితులు ఎక్కువైపోవడం వల్ల రివ్యూలు ఒకటీ మానేసాను తప్ప మిగతావి కొనసాగుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే సినిమా పాటల మీద వచ్చే ఆదాయం నా మొత్తం ఆదాయంలో సుమారు 20% ఉండొచ్చు.

పైన చెప్పిన ఉదాహరణల్లాగ పెద్ద లబ్ధప్రతిష్టుడిని అయిపోయానని చెప్పడంలేదు గానీ నా మనశ్శాంతి చెడకుండా, కాలం గడుస్తున్న సంగతి కూడా తెలియనంతగా గడుపుతున్నాను. నేను రచన కాకుండా నా స్వభావానికి తగని ఇంకెందులో వేలు పెట్టినా ఈ శ్లోకంలో చెప్పినట్టు “పరధర్మో భయావహః” అవుతుంది.

అయిష్టంతో భారంగా సాఫ్ట్ వేర్ కంపెనీల్లో జాబ్ చేస్తున్నవాళ్లు, ఎందుకొచ్చిన ఉద్యోగం రా బాబు అని ఎన్నో రంగాల్లో ఉన్నవాళ్లు నాకు కనపడుతూ ఉంటారు. అలాంటి ఒక బ్యాంక్ ఉద్యోగికి ఫ్లూట్ ప్లే చేయడం బాగా వచ్చు. అది అతని ఆసక్తి కూడా.

“జాబ్ వదిలేసి ఫ్లూట్ మీద కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు కదా” అన్నాను, అతను బ్యాంకింగ్ ఉద్యోగంలో పడుతున్న బాధలు చెప్పగా విని.

“అందులో నెలకింతని డబ్బెవడిస్తాడు. రిటైర్ అయ్యాక చేసుకోవాల్సిన పని అది” అన్నాడు అతను.

ఆసక్తి లేకుండా పని చేస్తే అసంతృప్త జీవితం మిగులుతుంది. మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు.
ఇక సామర్ధ్యం లేకుండా ఏ పనిలో ఉన్నా అది ఆ వ్యక్తికి గానీ, రంగానికి కానీ, దేశానికి కానీ మేలుని చేకూర్చదు. కీడునే కలిగిస్తుంది.
కనుక ఏదో రంగంలో ఫలానా వాడు బాగా సంపాదిస్తున్నాడని స్వధర్మం వదిలేసి పరధర్మం బాట పట్టకూడదు అంటోంది గీత.
“పర ధర్మో భయావహః” అంటే అదే.

మరి ఇష్టం లేకపోయినా కుటుంబం కోసం డబ్బు సంపాదించడానికి వేరే దారి లేక చేస్తున్న ఉద్యోగాలు వదిలేసి స్వభావానికి తగ్గ ఉద్యోగం వెతుక్కోవాలా?
అవసరం లేదు…

ఈ విషయం భగవద్గీతలో లేదు గానీ ఒక ఇంగ్లీష్ కొటేషన్లో ఉంది. “If you don’t get what you love, then love what you get“- నువ్వు ఇష్టపడింది నీకు దక్కనప్పుడు, నీకు దక్కినదాన్ని ఇష్టపడు.

ఇక్కడ దానిని అప్లై చేసుకోవడమే.

మనం చేస్తున్న ఉద్యోగం ఊడకుండా ఉందంటే అందులో మనకి సామర్థ్యం ఉన్నట్టే. కనుక అదే స్వధర్మం అనుకుని దానిని ప్రేమించడమే. అప్పుడు మనశ్శాంతి తోడుగా ఉంటుంది.

ఇక ఇదే భగవద్గీతలో 18వ అధ్యాయంలోని 47 శ్లోకంలో దాదాపు ఇలాంటిదే మరో శ్లోకం కనిపిస్తుంది.

శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్;
స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం.

ఇందులో మొదటి సగం పాతదే. రెండవ సగానికి అర్థం: “…స్వభావాన్ని అనుసరించి చేసే పని వల్ల పాపం అంటదు“.

ఇక్కడ పాపం అంటే గిల్ట్ ఫీలింగ్ అని నా అభిప్రాయం. తన స్వభావాన్ని అనుసరించి ధర్మంగా చేస్తున్న పనిలో ఏం చేయాల్సి వచ్చినా గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రాణం తీయడం తప్పే అనిపించినా సైనికులుగానో, పోలీసులుగానో ఉన్నవాళ్లు చట్టబద్ధంగా ఆ పని చేసేటప్పుడు నేరం ఎలాగో కాదు…వాళ్లు వ్యక్తిగతంగా కూడా ప్రాణం తీసిన పాపం చుట్టుకుంటుందేమో అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు.

ఆ మధ్య ఒక సీనియర్ పోలీసాఫీసర్ ఏదో మాటల సందర్భంలో తాను చేసిన మొదటి ఎన్-కౌంటర్లో ఒక మహిళ చనిపోయిందని, అది ఇప్పటికీ తనకి గిల్టీగా అనిపిస్తుందని చెప్పారు.

అప్పుడు నేను, “గిల్టీ ఫీలింగ్ అక్కర్లేదు సర్. రాముడు, కృష్ణుడు చేసిన మొదటి ఎన్-కౌంటర్లలో కూడా పోయింది ఆడవాళ్లే” అని జోక్ గా చెప్తే ఆయన నవ్వేసి బాగుందన్నారు.

ఇప్పుడు ఈ గీతలో విషయం కూడా ఆయనకి చెప్పాలి.

తదుపరి వ్యాసంలో మరొక గీతాశ్లోకంతో కలుద్దాం. ఆత్మ ఉందో, లేదో తేలుద్దాం.

-సిరాశ్రీ