సుక్కు ఛాన్స్ ఇవ్వడన్నారు కానీ..

టాలీవుడ్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా నటీనటులందరూ తప్పక నటించాలని కోరుకునే దర్శకుల్లో సుకుమార్ ఒకడు. తన సినిమాల్లో చిన్న పాత్రకైనా ఆయన ఇచ్చే ప్రాధాన్యం వేరు. మొక్కుబడిగా ఏ పాత్రను తెరమీద చూపించడు. కొన్ని నిమిషాలు కనిపించినా సరే.. ఆ పాత్ర తన ప్రాధాన్యాన్ని చాటుకునేలా తీర్చిదిద్దుతాడు.

అలాంటి దర్శకుడు తీసిన క్లాసిక్, బ్లాక్‌బస్టర్ మూవీ ‘రంగస్థలం’లో హీరో హీరోయిన్లు, విలన్ తర్వాత అంత కీలకమైన పాత్రలో అనసూయ వారెవా అనిపించింది. ఆమె చేసిన రంగమ్మత్త పాత్ర ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుందో, అనసూయకు ఎంత పేరొచ్చిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికీ ఆమెను రంగమ్మత్త అని పిలుస్తుంటారు అభిమానులు. ఇప్పుడు సుకుమార్ తీస్తున్న కొత్త చిత్రం ‘పుష్ప’లోనూ అనసూయ ఓ పాత్ర చేస్తుండటం విశేషం.

నిజానికి ముందు అనుకున్న స్క్రిప్టులో అనసూయ పాత్ర లేదు. కానీ తర్వాత ఆమెకు పాత్ర క్రియేట్ చేశారు. ఈ పాత్ర నిడివి కూడా ముందు తక్కువేనట. ఐతే సినిమాను రెండు భాగాలుగా మార్చాక దాన్ని పొడిగిస్తున్నట్లు సమాచారం. సుక్కుతో మరోసారి పని చేస్తున్న అనుభవం గురించి అనసూయ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “సుకుమార్ గారు ఆర్టిస్టులను ఒక లెక్కలో చెక్కుతారు. ఐతే ఆయన ఒక ఆర్టిస్టును ఒక సినిమాలో నటింపజేశాక వాళ్లను రిపీట్ చేయడం ఉండదని విన్నాను. కానీ నాకు మాత్రం సెకండ్ ఛాన్స్ దక్కింది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. ‘పుష్ప’లో నేను చేస్తున్న పాత్ర నా కెరీర్లో మరో మరపు రాని క్యారెక్టర్ అవుతుంది” అని చెప్పుకొచ్చింది.

‘పుష్ప’లో సునీల్‌కు భార్యగా అనసూయ కనిపించనుందని సమాచారం. వీళ్లిద్దరివీ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలేనట. ఇద్దరూ ఆ పాత్రల్లో చాలా బాగా ఒదిగిపోతున్నట్లు యూనిట్ వర్గాల సమాచారం.