ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ రైటర్ అంటే సాయిమాధవ్ బుర్రానే. క్రిష్ తీసిన కృష్ణం వందే జగద్గురుం, కంచె లాంటి సినిమాలతో మంచి పేరు సంపాదించిన సాయిమాధవ్.. ఆ తర్వాత చాలామంది పేరున్న దర్శకులు, హీరోలతో పని చేశాడు. రెండేళ్ల కిందట ఆయనకు కెరీర్లోనే అతి పెద్ద అవకాశం దక్కింది. తెలుగులో ప్రతి రచయితా కలలు కనే మెగాస్టార్ చిరంజీవి సినిమాకు పని చేసే అవకాశం ఆయనకు దక్కింది.
చిరు కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ‘సైరా: నరసింహారెడ్డి’కి ఆయన సంభాషణలు రాశారు. దిగ్గజ రచయితలు పరుచూరి సోదరులు అందించిన కథకు ఆయన మాటలు రాయడం విశేషం. ఇందులో సాయిమాధవ్ మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రానికి సంభాషణలు రాసే అవకాశం దక్కించుకున్నాడు సాయిమాధవ్.
ఇందులో చరణ్‌తో పాటు తారక్ కూడా హీరోగా నటిస్తుండగా.. ఇప్పుడు చరణ్ సోలో సినిమాకు కూడా సాయిమాధవ్ మాటలు అందించనున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ హీరోగా శంకర్ రూపొందించనున్న చిత్రానికి సంభాషణలు రాసే బాధ్యత సాయిమాధవ్‌కే అప్పగించారు.
శంకర్ సినిమాల్లో మాటలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఐతే ఇప్పటిదాకా తమిళ వెర్షన్లు చూసి తెలుగులో డబ్బింగ్ రైటర్లు మాటలు రాసేవారు. కానీ ఆయన చేస్తున్న తొలి స్ట్రెయిట్ తెలుగు మూవీ కావడంతో పెద్ద రైటర్లనే పెట్టుకోవాలి. ఇప్పుడు టాలీవుడ్లో నంబర్ వన్ రైటర్ అనదగ్గ సాయిమాధవే ఆ ఛాయిస్ అయ్యారు. దీని గురించి సాయిమాధవే స్వయంగా అప్డేట్ ఇచ్చారు.
శంకర్ తొలి చిత్రం ‘జెంటిల్‌మేన్’ చూసి ఆయనతో ఒక ఫొటో దిగితే చాలనుకున్నానని.. కానీ ఇప్పుడు ఏకంగా శంకర్ సినిమాకే మాటలు అందిస్తున్నానని.. ఈ అవకాశం ఇచ్చిన శంకర్, దిల్ రాజు, చరణ్‌లకు కృతజ్ఞతలని సాయిమాధవ్ ట్వీట్ వేశాడు. ఈ సందర్భంగా శంకర్‌తో స్క్రిప్టు చర్చల సందర్భంగా దిగిన ఫొటోను కూడా ఆయన షేర్ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates