తెలుగులో చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ డైరెక్టర్-మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్లలో తేజ-ఆర్పీ పట్నాయక్‌లది ఒకటి. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘చిత్రం’ అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషనో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమా ఘనవిజయాన్నందుకోవడంలో సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన నువ్వు నేను, జయం సైతం సంగీత పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ బ్లాక్బస్టర్లు అయ్యాయి. ఆపైనా వీళ్లిద్దరూ కలిసి కొన్ని సినిమాలు చేశారు కానీ.. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిన దూరమయ్యారు.
చివరగా తేజ, ఆర్పీ కలిసి చేసిన ‘ఔనన్నా కాదన్నా’ ఫ్లాపే అయింది కానీ.. అందులోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ అక్కడక్కడా ఆ పాటలు వినిపిస్తుంటాయి. తేజ సినిమా అంటే ఆర్పీ ఎంత శ్రద్ధ పెడతాడో ఆ సినిమా కూడా రుజువు చేసింది. ఐతే గత దశాబ్ద కాలంలో ఆర్పీ సంగీతాన్ని పక్కన పెట్టి దర్శకుడిగా ప్రయత్నాలు చేశాడు. అవి పెద్దగా ఫలితాన్నివ్వలేదు.
ఇప్పుడు ఆర్పీని సంగీత దర్శకుడిగా అందరూ దాదాపుగా మరిచిపోతున్న సమయంలో.. తేజ కోసం అతను మళ్లీ తన సంగీత పరిజ్ఞానాన్ని బయటికి తీయబోతున్నాడు. ఆర్పీ నుంచి విడిపోయాక అనూప్ రూబెన్స్ సహా మధ్యలో వేరే వేరే సంగీత దర్శకులతో పని చేసిన తేజ.. తిరిగి తన తొలి సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌తో చేతులు కలిపాడు.
చివరగా ‘సీత’తో పలకరించిన ఆయన.. అగ్ర నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా తీయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. దీనికి ఆర్పీనే మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా చిత్రీకరణ మధ్యప్రదేశ్‌లో మొదలు కాబోతోంది. షూటింగ్ ముంగిట అక్కడే సంగీత చర్చలు నడుస్తున్నాయి. తేజ, ఆర్పీలతో పాటు గేయ రచయిత చంద్రబోస్ కూడా ఈ చర్చల్లో పాల్గొంటున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చింది. మరి ఒకప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసిన తేజ-ఆర్పీ కాంబినేషన్లో ఈసారి ఎలాంటి ఆడియో వస్తుందో చూడాలి.