డ్యాన్స్ మాస్టర్.. హార్రర్ డైరెక్టర్

ఒకప్పుడంటే డ్యాన్స్ మాస్టర్లు కేవలం నృత్య దర్శకత్వానికే పరిమితం అయ్యేవాళ్లు. కానీ తర్వాతి తరం మాస్టర్లు మాత్రం తమలోని వేరే కళల్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. రాఘవ లారెన్స్ నటుడిగానే కాక దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే. ప్రభుదేవా సైతం నటుడిగా, దర్శకుడిగా మెరిశాడు. ఈ జాబితాలో మరింత మంది కనిపిస్తారు.
ఇప్పుడు ప్రముఖ డ్యాన్స్ మాస్టర్లలో ఒకడైన జానీ హీరోగా సత్తా చాటుకునే ప్రయత్నంలో ఉన్నాడు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తనదైన శైలిలో పాటలకు నృత్య రీతులు సమకూర్చి.. ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డ్యాన్స్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు జానీ మాస్టర్. ఇప్పటికే జానీ హీరోగా ఓ సినిమా మొదలైంది. ఇప్పుడు అతను ప్రధాన పాత్రలో మరో సినిమాను ప్రకటించడం విశేషం. ఆ చిత్రాన్ని కాస్త పేరున్న దర్శకుడే రూపొందించబోతున్నాడు.

14 ఏళ్ల కిందట ఛార్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిన హార్రర్ మూవీ ‘మంత్ర’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఆ చిత్రాన్ని రూపొందించి ఓషో తులసీరామ్. అతడికది దర్శకుడిగా తొలి చిత్రం. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తి కూడా కనిపించినప్పటికీ ఈ సినిమాతో అతను ప్రతిభ చాలుకున్నాడు. దీని తర్వాత కొన్నేళ్లకు ఛార్మినే పెట్టి ‘మంగళ’ అనే మరో హార్రర్ మూవీ తీశాడు. కానీ అది నిరాశ పరిచింది. మళ్లీ తులసీరామ్ కనిపించకుండా పోయాడు. ఇన్నేళ్లకు మళ్లీ అతను మెగా ఫోన్ పడుతున్నాడు.

జానీ మాస్టర్ హీరోగా అతను తన మూడో చిత్రాన్ని ప్రకటించడం విశేషం. ఈ సినిమాకు ‘దక్షిణ’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్ అట. ఇలాంటి సినిమాలో జానీ మాస్టర్ హీరోగా నటించడం కొంచెం చిత్రంగా అనిపించే విషయమే. అరకు, గోవా, బెంగళూరు, తదితర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరపనున్నారట. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది.