ప్రాణం సినిమా దెబ్బ‌కు ఆనంద్ వ‌దిలేసింద‌ట‌

ఆనంద్.. హీరో పేరును టైటిల్‌గా పెట్టిన సినిమానే. కానీ అందులో హీరోయిన్ పాత్రే హైలైట్. ఇందులో రూప పాత్ర‌లో న‌టించిన క‌మ‌లిని ముఖ‌ర్జీకి ఎంత మంచి పేరొచ్చిందో తెలిసిందే. ఇప్ప‌టికీ ఆమెను ఆ పాత్ర‌లో గుర్తుంచుకుంటారు జ‌నం. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళంలోనూ అవ‌కాశాలందుకుంది క‌మ‌లిని.

ఐతే నిజానికి ఈ పాత్ర‌ను క‌మ‌లిని చేయాల్సింది కాద‌ట‌. శేఖ‌ర్ ముందు రూప పాత్ర‌కు అనుకున్న‌ది స‌దాన‌ట‌. అప్ప‌టికే జ‌యం సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ అయిపోయిన స‌దాను రూప పాత్ర‌లో న‌టింప‌జేయాల‌నుకున్నాడ‌ట‌. కానీ ఆమె ఈ సినిమా క‌థ కూడా విన‌కుండానే నో చెప్పేసింద‌ట‌. ఇందుకు కార‌ణాలేంటో ఆలీ నిర్వ‌హించే ఒక టీవీ షోలో వెల్ల‌డించింది స‌దా.

ఆనంద్ కోసం అడ‌గ‌డానికి ముందే ఆమె న‌టించిన ప్రాణం పెద్ద డిజాస్ట‌ర్ అయింది. ఈ సినిమా కొత్త ద‌ర్శ‌కుడు, నిర్మాత‌లు తీసింద‌ని.. ముందు నిండు నూరేళ్ల సావాసం పాట వినిపించ‌డంతో క‌థ కూడా విన‌కుండా సినిమా ఓకే చేశాన‌ని.. ఐతే ఆ సినిమా ప‌రాజ‌యం పాల‌వ‌డం త‌న కెరీర్‌పై ప్ర‌భావం చూపింద‌ని.. ఆ స‌మ‌యంలోనే ఆనంద్ కోసం అడ‌గ‌డంతో కొత్త ద‌ర్శ‌కుడిని న‌మ్మి సినిమా చేసే సాహ‌సం చేయ‌లేక‌పోయాన‌ని స‌దా వెల్ల‌డించింది.

ఆ స‌మ‌యానికి త‌న మ‌న‌సు చెప్పిన‌ట్లు న‌డుచుకున్నాన‌ని.. కాబ‌ట్టి ఆనంద్ సినిమా చేయనందుకు రిగ్రెట్స్ ఏమీ లేవ‌ని స‌దా అంది. ఐతే చంద్ర‌ముఖి సినిమాలో న‌టించే అవ‌కాశం వ‌చ్చినా చేయ‌లేక‌పోవ‌డం గురించి మాత్రం ఎప్పుడూ బాధ ప‌డుతుంటాన‌ని స‌దా చెప్పింది. ముందు జ్యోతిక చేసిన గంగ పాత్ర కోసం అడిగార‌ని.. ఐతే అప‌రిచితుడులో న‌టిస్తుండ‌టం వ‌ల్ల డేట్లు స‌ర్దుబాటు చేయ‌లేక‌పోయాన‌ని.. త‌ర్వాత న‌య‌న‌తార చేసిన పాత్రను తానే చేయాల్సి ఉన్నా కొన్ని కార‌ణాల వ‌ల్ల కుద‌ర‌లేద‌ని స‌దా చెప్పింది.