రోజుల వ్యవధిలో కొడుకును, భర్తను కోల్పోవడం కంటే ఒక మహిళకు పెద్ద విషాదం ఏముంటుంది? టాలీవుడ్ సీనియర్ నటి కవిత పాపం ఈ పరిస్థితినే ఎదుర్కొన్నారు. కొన్ని రోజుల కిందటే కవిత కొడుకు సాయి రూప్ కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కవిత ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త దశరథ రాజ్ కన్ను మూశారు. ఆయన కూడా కరోనాతో పోరాడుతూనే బుధవారం కన్నుమూశారు.
కవిత కొడుకు కరోనా బారిన పడ్డ కొన్ని రోజులకు ఆమె భర్తకు కూడా వైరస్ సోకింది. ఆయన కొన్ని వారాల పాటు వైరస్‌తో పోరాడారు. కరోనా సంబంధిత సమస్యలు తలెత్తడంతో ఆరోగ్యం విషమించింది. కొడుకు మరణం గురించి కూడా దశరథ రాజ్‌కు తెలియకుండా దాచారని.. ఆయన కోలుకుని వచ్చాక విషయం చెప్పాలని చూశారని.. ఐతే ఈలోపు ఆయన మరణించారని అంటున్నారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దశరథ రాజ్ కన్ను మూశారు.
గత నెలలో ముందుగా సాయి రూప్ కరోనా బారిన పడ్డాడు. అతను హోం ఐసొలేషన్‌లో ఉంటూ కోలుకునే ప్రయత్నం చేయగా.. కొన్ని రోజుల తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. చిన్న వయసే కావడంతో అతను క్షేమంగా బయటికి వస్తాడని ఆశించారు. కానీ అతను ప్రాణాలు కోల్పోవడం కవిత కుటుంబానికి పెద్ద షాక్. ఇప్పుడు భర్తను కూడా కోల్పోయిన ఆమె ఎంతటి విషాదంలో ఉంటుందో అంచనా వేయొచ్చు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కలిపి కవిత 350 సినిమాలకు పైగా నటించారు. సినిమాల్లో అవకాశాలు తగ్గాక ఆమె సీరియళ్లలోనూ నటించారు. ముందు నుంచి ఆమె కుటుంబం చెన్నైలోనే స్థిరపడింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates