తాప్సీ లిస్ట్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్!

టాలీవుడ్ లో తాప్సీని కేవలం గ్లామర్ హీరోయిన్ గానే చూపించారు దర్శకులు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో నటించి తెలుగులో ఓ మోస్తరు పేరు సంపాదించుకుంది. కానీ ఎప్పుడైతే బాలీవుడ్ కి వెళ్లిందో అక్కడ ఆమెకి వరుస అవకాశాలు దక్కాయి. అవి కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కావడం విశేషం. దాదాపు ఆమె నటించిన సినిమాలన్నీ కూడా తాప్సీకి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

‘పింక్’, ‘బద్లా’, ‘తప్పడ్’ లాంటి సినిమాల్లో తాప్సీ తనలోని కొత్త యాంగిల్ తో ఆకట్టుకుంటుంది. కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలకు తాప్సీ బెస్ట్ ఛాయిస్ గా మారింది. ఇప్పుడు బాలీవుడ్ స్టార్లు కూడా తాప్సీపై దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఐదారు సినిమాలు ఉన్నాయి. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ దక్కించుకుందని సమాచారం. బాలీవుడ్ లో చాలా కాలంగా షారుఖ్ ఖాన్-రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ వస్తుందని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

ఎట్టకేలకు వీరి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందని తెలుస్తోంది. ఇటీవల రాజ్ హిరానీ వినిపించిన కథ షారుఖ్ కి బాగా నచ్చిందట. దీంతో ఆయన ఓకే చెప్పేశారని తెలుస్తోంది. సెప్టెంబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో హీరోయిన్ గా తాప్సీని తీసుకోవాలని చూస్తున్నారట. ఇదే గనుక నిజమైతే తాప్సీ రేంజ్ మరింత పెరిగిపోవడం ఖాయం. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన వివరాలు బయటకు రానున్నాయి. ప్రస్తుతం తాప్సీ నటించిన ‘హసీనా దిల్ రూబా’ విడుదలకు సిద్ధమవుతోంది.