బాలీవుడ్ ఆశ‌ల‌కు మ‌ళ్లీ బ్రేక్


పోయినేడాది క‌రోనా మ‌హ‌మ్మారి కొట్టిన దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదు బాలీవుడ్. ఫ‌స్ట్ వేవ్ త‌ర్వాత టాలీవుడ్ స‌హా కొన్ని ఇండ‌స్ట్రీలు కోలుకుని సినిమాలు రిలీజ్ చేసుకున్నాయి. మంచి వ‌సూళ్లే రాబ‌ట్టుకున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి నుంచి మూణ్నాలుగు నెల‌ల పాటు తెలుగు చిత్రాల సంద‌డి ఎలా సాగిందో తెలిసిందే. కానీ బాలీవుడ్లో మాత్రం ఏడాదికి పైగా క‌ళే లేదు. అక్క‌డ కాస్త పేరున్న సినిమాలేవీ విడుద‌ల కాలేదు. ఓటీటీలో కొన్ని సినిమాలు సంద‌డి చేయ‌డ‌మే త‌ప్పితే.. థియేట‌ర్ల‌లో క‌ళ లేక‌పోయింది. బాలీవుడ్‌కు దీని వ‌ల్ల వంద‌ల కోట్ల న‌ష్టం వాటిల్లింది. ఈ వేస‌వికి మ‌ళ్లీ క‌ళ వ‌స్తుంద‌నుకుంటే.. క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి దెబ్బ కొట్టింది.

ఐతే సెకండ్ వేవ్ ఉద్దృతి త‌గ్గాక గ‌త ఏడాది లాగా స్త‌బ్దుగా ఉండిపోకుండా.. ఈసారి దూకుడుగా సినిమాలు రిలీజ్ చేయాల‌నుకుంది బాలీవుడ్. ఈ దిశ‌గానే ముందుగా అక్ష‌య్ కుమార్ సినిమా బెల్‌బాటమ్ రిలీజ్ డేట్ కూడా ప్ర‌క‌టించారు.

మ‌రిన్ని సినిమాలనూ లైన్లో పెట్టారు. సెకండ్ వేవ్ త‌ర్వాత దేశంలో ముందుగా థియేట‌ర్ల‌ను తెరిచింది మ‌హారాష్ట్ర‌లోనే అన్న సంగ‌తి తెలిసిందే. కొన్ని రోజులు పాత సినిమాల‌ను న‌డిపించి జ‌నాల‌ను థియేట‌ర్ల‌కు అల‌వాటు చేశాక కొత్త సినిమాలు వ‌ద‌లాల‌నుకున్నారు. కానీ ఇంత‌లోనే బాలీవుడ్ ఆశ‌ల‌కు బ్రేక్ ప‌డింది. బాలీవుడ్‌కు కేంద్రం అయిన ముంబ‌యిలో థియేట‌ర్ల‌తో పాటు మాల్స్‌ను మూసి వేస్తూ మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

దేశంలో ప్ర‌మాద‌క‌ర‌ డెల్టా వేరియెంట్ క‌రోనా కేసులు వెలుగు చూస్తుండ‌టం, థ‌ర్డ్ వేవ్ ముప్పు గురించి హెచ్చ‌రిక‌లు వ‌స్తుండ‌టంతో మ‌హారాష్ట్ర స‌ర్కారు అప్ర‌మ‌త్త‌మైంది. ముందు జాగ్ర‌త్త‌గా థియేట‌ర్లు, మాల్స్ మూసివేయించింది. థియేట‌ర్ల మూత‌ ప‌ది రోజుల వ‌ర‌కే అని ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ.. ప‌రిస్థితుల్ని బ‌ట్టి ష‌ర‌తులను కొన‌సాగించే అవ‌కాశం లేక‌పోలేదు. అదే జ‌రిగితే బాలీవుడ్ రీస్టార్ట్‌కు ఇప్పుడిప్పుడే ఛాన్స్ లేన‌ట్లే. ఇక అనుకున్న‌ట్లే థ‌ర్డ్ వేవ్ ముప్పు త‌ప్ప‌క‌పోతే.. బాలీవుడ్ ఏంటి ఇండియాలో అన్ని వుడ్‌ల‌కూ క‌ష్ట‌మే.