ఫలితం అడక్కుండా పని చేయమన్నాడు

Bhagavad Gita

కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణీ

ఇది భగవద్గీతలో సుప్రసిద్ధమైన శ్లోకం.
2 వ అధ్యాయంలో 47 వది.
అర్థం చాలామందికి తెలిసిందే. అయినా ఒక్కసారి చెప్పుకుందాం-

“నీకు పని చెయ్యడం మీదే అధికారం ఉంది. దాని ఫలితం మీద మాత్రం లేదు. ఫలితానికి నువ్వు కారణం కాకూడదు. అలాగే పని చెయ్యడం మానకూడదు. ప్రతిఫలం ఆశించకుండా పనులు చెయ్యి”.

ప్రతిఫలం ఆశించకుండా పని చెయ్యడమేంటి? జీతం అడక్కుండా పని చేయమంటున్నాడా కృష్ణుడు? ఏ పనైనా ఫలితం ఆశించే కదా మొదలుపెడతాం. ఆఖరికి ఏదైనా దానం చేసేటప్పుడు కూడా “పుణ్యం” అనే ఫలితం ఆశించే కదా చాలామంది చేసేది. ఒకవేళ పాపపుణ్యాల మీద నమ్మకం లేనివాళ్లైతే కనీసం పన్నురాయితీనో, మంచి గుర్తింపో ఆశిస్తారు కదా!

చెప్పుకోవడానికే తప్ప అసలిది సాధ్యమా?
ఇలాంటి ప్రశ్నలు, సందేహాలు అనేకం వస్తాయి.

నాకు కూడా అదే సందేహం ఉండేది. అయితే ఒక అనుభవం ద్వారా ఆ సందేహం పోయింది. స్వానుభవంలోంచి చెప్పుకుంటే విషయాన్ని సాధికారికంగా చెప్పగలను కాబట్టి ఈ విషయం చెప్పుకుంటున్నాను.

చాలా ఏళ్ల క్రితం ఒక సినిమాకి పాట రాసే అవకాశం వచ్చింది. సంగీత దర్శకుడు నాకు మిత్రుడు కావడంతో డైరెక్టుగా ట్యూన్ పంపి జర్నలిజం మీద ఒక పాట కావాలన్నాడు. ట్యూన్ వినగానే నచ్చింది. అప్పుడున్న మూడ్ లో ఇంకేమీ అడగాలనిపించలేదు. అలాగేనని కాస్త టైం ఉండడంతో వెంటనే రాసి మొదటి వర్షన్ పంపించేసాను.

కొన్ని నిమిషాల్లో ఫోన్ చేసి, “పాట బాగా వచ్చింది. అయితే ఇది చిన్న సినిమా. పెద్దగా ఇచ్చుకోలేరు. ఇచ్చింది పుచ్చుకోవాలి దయచేసి” అన్నాడు సంగీత దర్శకుడు.

“అలాగే.. పాట నచ్చింది కదా. సంతోషం” అనేసాను.

నిజానికి ఆ సమయంలో ఎంత ఇస్తారన్న ఆలోచన నాకు రాలేదు. బహుశా ఆ సమయానికి నా దగ్గర అవసరానికి సరిపడా డబ్బులుండడం వల్ల కావచ్చు. కారణం పెద్దగా గుర్తులేదు కానీ దీని మీద దృష్టి అయితే పెట్టలేదు. అది మాత్రం గుర్తుంది.

తర్వాత రెండు రోజులకి షూటింగ్ లొకేషన్ కి పిలిచారు. ఒక కవర్ ఇస్తూ అందులో ఎంత ఉందో చెప్పారు.

“థాంక్స్” అని తీసుకున్నాను.

సంతోషంగా జేబులో పెట్టుకున్నాను. ఆ సంతోషానికి కారణం ఎంతిస్తారో, ఎప్పుడిస్తారో అనే ఆలోచన లేకపోవడమే. అంటే ఫలితం మీద దృష్టి లేకపోవడమే. అందుకే ఆ సంతోషం మనసు మీద వాలింది. ఇదంతా భగవద్గీత శ్లోకం తెలిసి కాదు…జస్ట్ ఫ్లోలో అలా..అంతే!

ఇంతకీ విషయమేంటంటే ఆ పాట రికార్డ్ అయితే అయ్యింది గానీ బయటికి రాలేదు. ఎందుకంటే సినిమా ఆగిపోయింది. ఇలాంటివి సినిమా రంగంలో జరుగుతూనే ఉంటాయి. కాలక్రమంలో దాని సంగతి మర్చిపోయాను. నేను రాసిన పాటల లిస్టులో కూడా ఆ పాటని చేర్చుకోలేనంతగా మర్చిపోయాను.

కొన్నేళ్లు గడిచిపోయాయి. ఒకరోజు ఒకాయన ఫోన్ చేసాడు. అప్పటికే జోరుగా జరుగుతున్న ఒక ఉద్యమానికి నేను ఒక పాట రాయాలన్నది ఆ కాల్ సారాంశం. సినిమా పాట కాకుండా ప్రైవేట్ సాంగ్ అన్నమాట. అయితే అది ఒక కులానికి సంబంధించిన ఉద్యమం అని, నేను ఆ వర్గానికి చెందిన వ్యక్తిని కాదని, పొరబడి అడుగుతున్నారేమో అని ఆయనకి వివరించే ప్రయత్నం చేసాను.

అన్ని విషయాలు తెలిసే ఫోన్ చేసానని, ఆ వర్గం కాకపోయినా ఆ ఉద్యమానికి కావాల్సిన సాహిత్యం నాచేతే రాయించాలని ఫిక్స్ అయిపోయామని చెప్పాడు. నిజానికి ఆ సమయానికి నాకు డబ్బు అవసరం ఉంది. ఆలోచిస్తుండగానే, “మీకు మంచి పారితోషకం ఇస్తాం” అన్నాడతను.

“ఇంతకీ నేనే రాయాలని మీకు ఎందుకు అనిపించింది?” అనడిగాను.

“మీరు రాసిన జర్నలిజం పాట వినడం వల్ల” అంటూ ఆ సంగీత దర్శకుడి పేరు కూడా చెప్పాడు.

అదేం పాటో గుర్తు తెచ్చుకోవడానికి రెండు క్షణాలు పట్టింది. తట్టిన వెంటనే ఆశ్చర్యమేసింది.

“అదేంటి. ఆ పాట ఎక్కడ విన్నారు మీరు? ఆడియో కూడా బయటకు రాలేదు కదా?” అని ప్రశ్నించాను.

“కానీ మా దగ్గరకొచ్చిందండీ. ఆ సినిమాకి పని చేసిన కొందరు నాకు తెలుసు. మా మిత్రులమంతా కలిసి వినే వాళ్లం. మీ గురించి అప్పుడే వాకబు చేసాం. ఆ పాట విషయంలో మీరు మాకు అభిమాన కవి” అన్నాడు.

“ఇంతకీ..మీరు…” అని నేను అడగబోతుండగా..

“నేను పౌరహక్కుల మీద పోరాడే సంస్థలకు చెందిన వాడిని” అని బదులిచ్చాడు.

“అలాగా!” అని నేను అనగానే…

“ఫిల్మ్ నగర్లో ఫలానా మీకు తెలిసిన వారి ఆఫీసులో కలుద్దాం మీకు ఓకే అయితే” అని లోకేషన్ కూడా చెప్పి ఫోన్ పెట్టేసాడు.

నేను ఆ ఫిల్మ్ నగర్ మిత్రుడికి ఫోన్ చేసి కంఫర్మ్ చేసుకున్నాక వెళ్లాను. అక్కడికి అతను కూడా వచ్చాడు. కాసేపు మాట్లాడుకున్నాక ఆ ఉద్యమానికి సంబంధించిన కార్యకర్తలు ఇద్దరు వచ్చారు. అందరూ కలిసి ఆ ఉద్యమ నాయకుడి దగ్గరకి తీసుకెళ్లారు. అరగంటలో మీటింగ్ పూర్తయ్యింది. వారు కోరిన దానిని అనుసరించి రాత్రికి ఒక పాట రాసి పంపించాను. అది వాళ్లందరికీ నచ్చింది. మర్నాడే మరో రెండు పాటలు రాయమని కోరారు. అవి కూడా పూర్తి చేసేసాను.

ఆ సాయంత్రమే వారు సంతోషంగా నాకు మూడు పాటలు రాసినందుకు గాను అంటూ లావుపాటి కవర్ ఒకటి పంపారు. విప్పి చూస్తే నిజానికి ఆ టైములో నాకు ఒకానొక ఖర్చుకి ఎంత అవసరమని అనుకున్నానో అక్షరాలా అంతే పెద్ద మొత్తం అందులో ఉంది.

ఎక్కడి ఆ రిలీజవ్వని జర్నలిజం పాట, ఎక్కడి ఈ ఉద్యమం…ఏ ప్రయత్నమూ లేకుండా ఏవేవో లింకులతో నాకు అవసరమైన మొత్తం ఈ విధంగా సమయానికి రావడం.

గతంలో నాకు ఈ “కర్మణ్యే వాధికారస్తే…” విషయంలో పైన చెప్పినట్టు సందేహాలు ఉండేవి కానీ ఈ అనుభవం అయ్యాక సందేహాలు పోయాయి.

నీకు పని చెయ్యడం మీదే అధికారం ఉంది (అడిగిన పాట రాసాను)
దాని ఫలితం మీద మాత్రం లేదు (ఆ పాట వల్ల పెద్ద బేరం కుదురుతుందని అనుకోలేదు).
ఫలితానికి నువ్వు కారణం కాకూడదు (ఆ మొదట రాసిన పాట పౌరహక్కుల వాళ్లు వినడానికి నేను కారణం కాదు)  
అలాగే పని చెయ్యడం మానకూడదు (వేరే పనులు చేసుకుంటూనే ఉన్నాను)
ప్రతిఫలం ఆశించకుండా పనులు చెయ్యి (ఈ ఒక్కపనీ అలా చేసాను అప్రయత్నంగా…)

ఇదొక ఉదాహరణగా చెప్పాను తప్ప నేను అన్ని పనులు ఇలానే చేస్తానని చెప్పడంలేదు. ఈ శ్లోకాన్ని తెలియకుండా అనుసరించి ఒక పని చేసినప్పుడు జరిగిన పర్యవసానాల గురించి పంచుకున్నానంతే.

ఆశించకుండా చేసే పని యొక్క ఫలితం మనకి అవసరమైనప్పుడు అదే వస్తుంది. కాదు… ఇవ్వబడుతుంది.

ఒక్కోసారి ఫలితం ఏదీ రాకపోవచ్చు కూడా..అలాంటప్పుడు రిగ్రెట్స్ ఎలాగో ఉండవు..ఆశిస్తేనే కదా ఏ రిగ్రెట్ అయినా! ఒకవేళ ఆ జర్నలిజం పాట వల్ల నాకు మరొక అవకాశం ఏదీ రాకపోయినా పైన చెప్పిన దానిని బట్టి పట్టించుకునే పరిస్థితిలో లేను కదా.

ఇదొక్కటీ ఏదో జరిగిందిలే..దీనికి, భగవద్గీతకి లింకు పెట్టేసుకుంటే ఎలా అని అనుకుంటే పొరపాటే. తర్వాత ఇలాంటివి నాకు చిన్నవో పెద్దవో జరుగుతూనే ఉన్నాయి. గతంలో కూడా కొన్ని జరిగాయి. డాట్స్ కనెక్ట్ చేసుకుంటుంటే ఆ అనుభవాలన్నీ ఈ శ్లోకం దగ్గరే వచ్చి ఆగాయి.

ఇలాంటి అనుభవాలు అందరికీ జరుగుతాయి. దృష్టి పెడితే ఒకటి కాదు ఎన్నో ఉంటాయి. యాదృచ్ఛికం అనో, ప్రతిభ ఉంటే అవకాశం వెతుక్కుంటూ వస్తుందనో మనలో ఉన్న “అహం” అనే కన్ను తెరిచి చెప్పకుండా, కాసేపు దానిని మూసి ఉంచితే ఈ “కర్మణ్యే వాధికారస్తే” శ్లోకం స్ఫురిస్తుంది.

ఇంతకీ ఆ ఆగిపోయిన సినిమా పేరు “రిపోర్టర్”. సంగీత దర్శకుడు రఘు కుంచె. నేను ప్రస్తావించిన ఉద్యమం “కాపు గర్జన”. ఫోన్ చేసిన వ్యక్తి పేరు మహేంద్ర చక్రవర్తి. ఆ నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు.

తదుపరి వ్యాసంలో మరొక గీతాశ్లోకం గురించి చెప్పుకుందాం. ప్రవృత్తికి తగిన వృత్తిని ఎంచుకోమని కృష్ణుడు ఎందుకు చెప్పాడో చర్చిద్దాం.

సిరాశ్రీ