ర‌కుల్ హ‌ర్టు.. హ‌రీష్ శంక‌ర్ స‌పోర్టు


ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో భాగంగా తెలుగులో త‌న సినిమాలు త‌గ్గాయ‌ని పేర్కొంది. ఐతే దాన్ని రిపోర్ట్ చేసే క్ర‌మంలో ఓ నేష‌న‌ల్ వెబ్ సైట్.. తెలుగులో త‌న‌కు ఛాన్సులే రావు అన్న‌ట్లుగా పేర్కొన‌డం ఆమెను బాధించింది. స‌ద‌రు ఇంగ్లిష్ డైలీ రాసిన వార్త తాలూకు లింక్‌ను షేర్ చేస్తూ కొంచెం గ‌ట్టిగానే రిటార్ట్ ఇచ్చింది. టాలీవుడ్లో త‌న‌కు ఛాన్సుల్లేవ‌ని ఎప్పుడు అన్నాన‌ని ఆమె ఆశ్చ‌ర్య‌పోయింది.

సంవ‌త్స‌రంలో 365 రోజులు మాత్ర‌మే ఉంటాయ‌ని.. తాను ప్ర‌స్తుతం ఏడాదికి ఆరు సినిమాలు చేస్తున్నాన‌ని.. అంత‌కుమించి ఎక్కువ సినిమాలు చేయ‌డానికి వీలుగా ఎవ‌రైనా డేట్లు స‌ర్దుబాటు చేసి ఇవ్వాల‌ని ర‌కుల్ వ్యంగ్యంగా స్పందించింది. ర‌కుల్ చేసిన ఈ ట్వీట్ మీద టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ స్పందించ‌డం విశేషం. త‌న స్నేహితుడొక‌రు ర‌కుల్‌కు ఓ సినిమా ఆఫ‌ర్ చేయ‌గా.. ఆ సినిమా స్క్రిప్టు బాగా న‌చ్చిన‌ప్ప‌టికీ డేట్లు స‌ర్దుబాటు చేయ‌లేకపోయింద‌ని.. ఆమె కోసం సినిమానే వాయిదా వేశార‌ని హ‌రీష్ వెల్ల‌డించాడు. కాబ‌ట్టి ఇలాంటి వార్త‌ల‌ను ప‌ట్టించుకోకుండా ర‌కుల్ దూసుకెళ్లాల‌ని.. త‌న పనే త‌న త‌ర‌ఫున మాట్లాడుతుంద‌ని హ‌రీష్ పేర్కొన్నాడు.

ఐతే డేట్లు స‌ర్దుబాటు చేయ‌లేక‌పోతోందో.. మ‌రో కార‌ణ‌మో కానీ.. ఒక‌ప్పుడు టాలీవుడ్లో వ‌రుస‌గా పెద్ద పెద్ద సినిమాల్లో న‌టించిన ర‌కుల్.. గ‌త కొన్నేళ్ల‌లో మాత్రం ఇక్క‌డ స్పీడు త‌గ్గించింది. చివ‌ర‌గా ఆమె చెక్ సినిమాతో ప‌ల‌క‌రించ‌గా.. అది పెద్ద డిజాస్ట‌ర్ అయింది. అంత‌కుముందు నాగార్జున‌తో చేసిన మ‌న్మ‌థుడు-2 సైతం డిజాస్ట‌రే. ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన సినిమాలో ర‌కుల్ న‌టించింది. అది విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.