ప్లాప్ హీరోయిన్ ను తీసుకోవాలని అనుకోరు!

వరుస హిట్టు సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది పూజాహెగ్డే. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ప్రభాస్ సరసన ‘రాధేశ్యామ్’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. అయితే ఇన్నాళ్లకు తన కల నెరవేరిందని చెబుతోంది ఈ బ్యూటీ. ఏ హీరోయిన్ కైనా పాన్ ఇండియా స్టార్ అవ్వాలనే డ్రీమ్ ఉంటుందని.. కానీ చాలా తక్కువ మందికి అలాంటి గుర్తింపు వస్తుందని.. ఆ లిస్ట్ లో తను కూడా ఉన్నందుకు సంతోషంగా ఉందని చెబుతోంది.

హృతిక్ రోషన్ తో ‘మొహంజదారో’ సినిమా చేసినప్పుడు చాలా కలలు కన్నానని.. కానీ సినిమా సరిగ్గా ఆడలేదని చెప్పింది. ప్లాప్ వచ్చిన హీరోయిన్ కి ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారని.. అలాంటి ఇబ్బందులను తను కూడా ఎదుర్కొన్నట్లు చెప్పింది. కెరీర్ ఆరంభంలో అటువంటి చేదు అనుభవాలు చవిచూడడం తనకు బాగా కలిసొచ్చిందని చెబుతోంది పూజాహెగ్డే.

ప్రతి సినిమా ఆడుతుందనే నమ్మకంతోనే చేస్తామని.. ఇప్పుడు హిట్స్, ఫ్లోప్స్ కు అతీతంగా వ్యవహరించడం నేర్చుకున్నట్లు చెప్పింది. ఓ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఇక దాని నుండి బయటకొచ్చేస్తున్నానని తెలిపింది. ఈ మధ్యకాలంలో వరుస సక్సెస్ లతో కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని నమ్మకంగా చెబుతోంది. ఇప్పుడు బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్నట్లు చెప్పింది. పాన్ ఇండియా నటి కావాలనే కల ఇప్పుడు నిజమైందని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది.