కరోనా రెండో దశ ఉద్ధృతికి రెండు నెలల కిందట దేశవ్యాప్తంగా థియేటర్లు మూత పడటం మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో కొంచెం లేటుగా థియేటర్ల ప్రదర్శన ఆగింది. చివరగా వకీల్ సాబ్‌తో థియేటర్లు కళకళలాడాయి. ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడుతుండగానే.. ఏప్రిల్ చివరి వారంలో థియేటర్లు మూతపడ్డ సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కర్ఫ్యూ, లాక్ డౌన్ అమలవడంతో థియేటర్లను మూత వేయక తప్పలేదు. ఇక అప్పట్నుంచి వెండితెరలు వెలవెలబోతూ ఉన్నాయి.
తెలంగాణలో లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఆగస్టు లేదా దసరాకు కానీ బిగ్ స్క్రీన్లలో సినిమాల సందడి మొదలు కాదనుకుంటున్నారు. ఏపీలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. థియేటర్లపై ఎవరికీ ప్రస్తుతం ఆశల్లేవు.
ఐతే ఏపీలో ఇప్పుడు ఒక ప్రముఖ థియేటర్ తెరుచుకుంటుండటం, అక్కడ ఓ సినిమా ప్రదర్శనకు రంగం సిద్ధం చేయడం విశేషం. విశాఖపట్నంలోని ప్రఖ్యాత జగదాంబ థియేటర్లో సంక్రాంతి హిట్ మూవీ క్రాక్‌ను ప్రదర్శిస్తున్నారు. ఏపీలో తాజాగా కర్ఫ్యూను ఇంకో పది రోజులు పొడిగించిన ప్రభుత్వం.. ఉదయం 6-12 గంటల మధ్య జనాలు బయట తిరిగేందుకు, వ్యాపారాలు నిర్వహించుకునేందుకు ఉన్న వెసులుబాటును ఇంకో రెండు గంటలు పొడిగించింది. అంటే మధ్యాహ్నం 2 వరకు అన్ని కార్యకలాపాలు కొనసాగుతాయన్నమాట.
కర్ఫ్యూ పెట్టడానికి ముందు థియేటర్లపై ప్రత్యేకంగా ఆంక్షలేమీ పెట్టని నేపథ్యంలో ఇప్పుడు మార్నింగ్ షో ప్రదర్శనకు అవకాశం దొరికింది. దీంతో జగదాంబ థియేటర్ యాజమాన్యం ఉదయం పదిన్నర నుంచి మార్నింగ్ షో ఒకటి నడిపించే ఏర్పాట్లు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ తర్వాత తెరుచుకుని సినిమా నడిపించబోతున్న తొలి, ఏకైక థియేటర్ ఇదే కావడం విశేషం.