రీఎంట్రీలో పవన్ కళ్యాణ్ ఎంత స్పీడు మీదున్నాడో తెలిసిందే. పునరాగమనంలో తొలి సినిమా ‘వకీల్ సాబ్’ పూర్తి కాకముందే క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలను పవన్ ఓకే చేయడం తెలిసిందే. ఆ తర్వాత మధ్యలోకి ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ సైతం వచ్చి పడింది. 2024 ఎన్నికల కోసం బ్రేక్ తీసుకోవడానికి ముందే ఈ సినిమాలన్నీ పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నాడు పవన్.
ఐతే ఈ సినిమాలను పూర్తి చేయడమే కష్టం అనుకుంటుంటే.. పవన్‌తో సినిమా చేయడం కోసం వేరే నిర్మాతలు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ‘జేబీ ఎంటర్టైన్మెంట్స్’ అధినేతలైన సీనియర్ నిర్మాతలు భగవాన్, పుల్లారావు కూడా ఉన్నారు. చాలా మందికి ఇచ్చినట్లే వాళ్లకు కూడా పవన్ కమిట్మెంట్ ఇచ్చాడు. పవన్‌తో ఈ ఏడాదే తాము సినిమా మొదలుపెట్టాల్సిందని.. వచ్చే ఏడాది కచ్చితంగా ఆ చిత్రం ఉంటుందని ఆ మధ్య మీడియాతో భగవాన్, పుల్లారావు చెప్పడం విశేషం.
మరి భగవాన్, పుల్లారావు.. పవన్‌తో సినిమా చేసేట్లయితే దానికి దర్శకుడెవరన్నది ఆసక్తికరం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు డైరెక్టర్ రేసులో పూరి జగన్నాథ్ ఉన్నాడట. పవన్‌తో తీసిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘బద్రి’తో దర్శకుడిగా తన ప్రయాణాన్ని ఆరంభించిన పూరి.. ఆ తర్వాత చాలా ఏళ్లకు ‘కెమెరామన్ గంగతో రాంబాబు’తో మళ్లీ పవర్ స్టార్‌తో జట్టు కట్టాడు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. మళ్లీ ఈ ఇద్దరూ కలిసే సంకేతాలు ఎప్పుడూ రాలేదు.
ఐతే మహేష్ బాబుతో చేయాలనుకున్న తన కలల ప్రాజెక్టు ‘జనగణమన’ వర్కవుట్ కాకపోవడంతో.. సమకాలీన పరిస్థితులు, రాజకీయాల చుట్టూ తిరిగే ఆ కథను పవన్‌తో చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో పూరి ఉన్నట్లు ఇంతకుముందే వార్తలొచ్చాయి. ఇప్పుడు భగవాన్, పుల్లారావు.. పూరీతోనే సంప్రదింపులు జరుపుతున్నారని.. అంతా ఓకే అయితే పవన్-పూరి కలయికలో ‘జనగణమన’ వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఎంత పెద్ద హీరోతో సినిమా అయినా మూణ్నాలుగు నెలల్లో పూరి పూర్తి చేసేస్తాడు కాబట్టి.. పవన్ కొంచెం వీలు చేసుకుంటే ఈ సినిమా కార్యరూపం దాల్చడం కష్టం కాకపోవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates