యంగ్ డైరెక్టర్ తో బాలయ్య..!

సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని ఊహించని కాంబినేషన్స్ సెట్ అవుతుంటాయి. అలా వచ్చిన చాలా సినిమాలు విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు కూడా ఓ సరికొత్త కాంబోలో సినిమా వచ్చే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. నందమూరి బాలకృష్ణతో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. అనీల్ రావిపూడి లాంటి యంగ్ డైరెక్టర్ కూడా బాలయ్య కోసం కథ రాసుకొని సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు అనీల్ తో పాటు మరో యంగ్ డైరెక్టర్ కూడా బాలయ్య హీరోగా సినిమా చేయాలనుకుంటున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరంటే వెంకీ అట్లూరి. ‘స్నేహగీతం’ అనే సినిమాలో నటించిన ఇతడు ఆ తరువాత దర్శకుడిగా మారి సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. వరుణ్ తేజ్ హీరోగా చేసిన ‘తొలిప్రేమ’ సినిమా భారీ విజయాన్ని తీసుకొచ్చింది. ఆ తరువాత తెరకెక్కించిన ‘మిస్టర్ మజ్ను’,’రంగ్ దే’ లాంటి సినిమాలు ఏవరేజ్ గా ఆడాయి. అతడి సినిమాలన్నీ ఒకే రకంగా ఉంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి.

ఈ క్రమంలో తన తదుపరి సినిమా కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రీసెంట్ గా ఈ కుర్ర డైరెక్టర్ బాలయ్యను మీట్ అయినట్లు సమాచారం. తన దగ్గరున్న ఓ స్టోరీ లైన్ ను బాలయ్యకు వినిపించారట వెంకీ అట్లూరి. పూర్తి కథను సిద్ధం చేశాక.. అది సంతృప్తిగా అనిపిస్తే అప్పుడు చూద్దామని బాలయ్య చెప్పారట. దీంతో వెంకీ అట్లూరి ప్రస్తుతం కథను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం బాలయ్య ‘అఖండ’ సినిమాలో నటిస్తున్నారు. దీని తరువాత గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నారు.