హాలీవుడ్ లో రాజమౌళి సినిమా!

వరుస సూపర్ హిట్ చిత్రాలతో టాలీవుడ్ లో అగ్ర దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో రీచ్ అయ్యారు. ప్రపంచస్థాయిలో ఇండియన్ సినిమా రేంజ్ ను పెంచిన రాజమౌళి ఇప్పుడు తన దృష్టిని హాలీవుడ్ పై పెట్టాడు. త్వరలోనే రాజమౌళి ఓ ఇంటర్నేషనల్ సినిమా చేయబోతున్నారు. ఇక్కడ విశేషమేమిటంటే.. ఇండియన్ కథనే తీసుకొని.. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా తీస్తారట.

దీనికోసం ఓ ప్రముఖ హాలీవుడ్ సంస్థతో అగ్రిమెంట్ కూడా పూర్తయింది. ఈ సినిమాకి సంబంధించిన కథ కూడా పూర్తయింది. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి కథ అందిస్తున్నారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ కు పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. ఇందులో టెక్నీషియన్స్ మాత్రమే హాలీవుడ్ కు చెందిన వాళ్లు ఉంటారని.. నటీనటులంతా ఇక్కడివారే ఉంటారని సమాచారం.

ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ సినిమా లెక్క ప్రకారం ఈ ఏడాదిలోనే విడుదల కావాలి. కానీ ప్రస్తుతం పరిస్థితుల కారణంగా వాయిదా పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సినిమా తరువాత రాజమౌళి.. మహేష్ బాబుతో సినిమా చేయాలనుకున్నారు. ముందుగా మహేష్ సినిమాను పూర్తి చేసి ఆ తరువాత తన హాలీవుడ్ సినిమాను మొదలుపెడతారేమో చూడాలి!