‘ఆర్ఆర్ఆర్’ ఫైట్లు చూసి ఆయన కళ్లల్లో నీళ్లు

‘బాహుబలి’ తర్వాత రాజమౌళి నుంచి రాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ అంచనాల్ని ఇంకా పెంచేలా చిత్ర బృందంలోని ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో యాక్షన్ ఘట్టాల గురించి అందరూ చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ సైతం యాక్షన్ సన్నివేశాల గురించే ఎలివేషన్ ఇచ్చాడు.

తాజాగా ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ రచయిత విజయేంద్ర ప్రసాద్.. అందులోని యాక్షన్ ఘట్టాలపై అంచనాలు పెంచే వ్యాఖ్యలు చేశాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయనకు ‘ఆర్ఆర్ఆర్’ హైలైట్ల గురించి ప్రశ్న ఎదురైంది. దానికాయన బదులిస్తూ.. మామూలుగా యాక్షన్ సీన్లు చూస్తే ప్రేక్షకులు అరవడం, విజిల్స్ వేయడం, చప్పట్లు కొట్టడం లాంటివి చేస్తారని.. కానీ తొలిసారిగా ‘ఆర్ఆర్ఆర్’లో యాక్షన్ ఘట్టాలు చూస్తున్నపుడు మాత్రం తన కళ్లల్లో నీళ్లు తిరిగాయని విజయేంద్ర చెప్పారు.

రేప్పొద్దున థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకుల అనుభూతి కూడా ఇలాగే ఉంటుందని ఆయనన్నారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’లో ఒక హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ గురించి విజయేంద్ర మాట్లాడుతూ.. ‘స్టూడెంట్ నంబర్ వన్’లో చూసినపుడే తారక్ ఏదో ఒక రోజు గొప్ప స్థాయికి చేరుకుంటాడని తాను అనుకున్నానని విజయేంద్ర వ్యాఖ్యానించారు. తారక్ ఏ రసాన్నయినా అద్భుతంగా పలికిస్తాడని.. ఐతే తాను అతడి నుంచి కోరుకునేది కరుణ రసమని.. దాన్ని పలికించే సినిమాలు అతను చేయట్లేదని.. అలాంటివి అతణ్నుంచి ఆశిస్తున్నానని విజయేంద్ర చెప్పారు.

తారక్ సినిమాల్లో ఇష్టమైంది ఏది అని అడిగితే.. తమ కాంబినేషన్లో వచ్చినవి కాకుండా ‘అదుర్స్’ను తాను చాలా ఇష్టపడతానని.. అందులో చారి పాత్రను అద్భుతంగా చేశాడని.. ఆ పాత్ర కామెడీ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టడదని.. తన టీంకు ఏం తోచనపుడల్లా ‘అదుర్స్’ కామెడీ సీన్లు పెట్టుకుని చూస్తుంటామని ఆయన వెల్లడించడం విశేషం.