ప్రభాస్ సినిమా.. అతడికి మరింత టైం


‘మహానటి’ సినిమా విడుదలై మూడేళ్లు దాటిపోయింది. ఇప్పటికీ ఆ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ కొత్త సినిమా మొదలు కాలేదు. ప్రభాస్ లాంటి బిగ్ స్టార్‌తో సినిమా కావడంతో వేరే చిత్రాలతో పోలిస్తే కొంచెం ఎక్కువ సమయం తీసుకోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ స్క్రిప్టు తయారీ, ప్రి ప్రొడక్షన్ వర్క్‌కే మూడేళ్లకు పైగా సమయం తీసుకోవడం అంటే చాలా ఎక్కువే. ప్రభాస్ రెడీగా ఉంటే ఇప్పటికే షూటింగ్ మొదలైపోయేది కానీ.. ఈ సినిమా అనౌన్స్ చేశాక ప్రభాస్ ఆదిపురుష్, సలార్ చిత్రాలను ముందుకు తీసుకురావడంతో ఇది వెనక్కి వెళ్లిపోయింది.

ఐతే లేటైతే అయ్యింది, ప్రి ప్రొడక్షన్ కోసం మరింత సమయం దొరికింది కదా అని నాగ్ అశ్విన్ అండ్ టీం తాపీగా ఆ పనులు చేసుకుంటూ వస్తోంది. ఆ పనులన్నీ ముగించి జులైలో చిత్రీకరణ మొదలుపెట్టే అవకాశాలున్నట్లు ‘జాతిరత్నాలు’ విడుదలప్పుడు నాగ్ అశ్విన్ మీడియాకు వెల్లడించాడు.

కానీ తాజా సమాచారం ప్రకారం ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా జులైలో కాదు కదా.. ఈ ఏడాదంతా మొదలయ్యే అవకాశాలే లేవట. కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ఆదిపురుష్, సలార్ చిత్రాల షెడ్యూళ్లన్నీ దెబ్బ తిన్నాయి. షూటింగ్స్ ఆపేసి కూర్చుున్నారు. మళ్లీ పరిస్థితులు చక్కబడ్డాక ముందు ‘ఆదిపురుష్’ కోసం డేట్లు ఇస్తున్నాడు ప్రభాస్. విరామం లేకుండా మూడు నెలల పాటు ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనబోతున్నాడు. దీని కోసం లుక్ మెయింటైన్ చేయాల్సి ఉండటంతో ఆ మూడు నెలలు ‘సలార్’ వైపు వెళ్లడు.

ఈ లాంగ్ షెడ్యూల్ అయ్యాక బ్రేక్ తీసుకుని ‘సలార్’ షూటింగ్ పున:ప్రారంభిస్తాడట. దాని కోసం రెండు నెలలు పని చేసే అవకాశముంది. కాబట్టి ఈ ఏడాది నాగ్ అశ్విన్ సినిమాను మొదలుపెట్టే అవకాశాలు దాదాపు లేనట్లేనట. ఆ సినిమా 2022కు వెళ్లిపోయినట్లే అంటున్నారు. కాబట్టి నాగ్ అశ్విన్‌ మరింత తాపీగా ప్రి ప్రొడక్షన్ పనులు చేసుకోవచ్చు. స్క్రిప్టుకు మరింత మెరుగులు దిద్దుకోవచ్చన్నమాట.