ఈ సినిమా థియేటర్లలోకి వచ్చుంటే..

ఎప్పుడో ఏడాది ముందే విడుదల కావాల్సిన సినిమా ‘రాధె’. గత రంజాన్‌కే రిలీజ్ అనుకున్నారు కానీ.. కరోనా-లాక్ డౌన్ కారణంగా ఆ చిత్రాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. థియేటర్లు మళ్లీ ఎప్పుడు మామూలుగా నడుస్తాయా అని ఎదురు చూసి చూసి.. చివరికి ఆ ఆశ ఫలించక ఈ రంజాన్ పండక్కి ఓటీటీ, డీటీహెచ్‌ల ద్వారా ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో రిలీజ్ చేసేశారు.

ఒకేసారి థియేట్రికల్ రిలీజ్ కూడా అన్నారు కానీ.. ఇండియాలో మెజారిటీ రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడి ఉన్న నేపథ్యంలో ఆ మార్గంలో రిలీజ్ నామమాత్రమే. ఇంటర్నేషనల్ మార్కెట్లలో మాత్రం వెండి తెరలపై ప్రదర్శితమైంది ‘రాధె’. ఐతే స్ట్రీమింగ్ మొదలు కావడం ఆలస్యం రూ.249 రేటు పెట్టి ఎంతో ఆశగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు ‘రాధె’ దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. ఇంత సిల్లీ సినిమాను సల్మాన్ ఖాన్ ఎలా చేశాడు.. ఈ చిత్రానికి ఇంత బిల్డప్ ఎలా ఇచ్చారు అనే సందేహాలు కలిగాయి చూస్తున్నంతసేపూ.

మాస్ మసాలా సినిమాలు కొన్నిసార్లు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంటూ ఉంటాయి. ఐతే కథ మీద కనీస కసరత్తు లేకుండా.. ఏమాత్రం కొత్తదనం లేకుండా మాస్ మాస్ అంటూ రొడ్డకొట్టుడు సినిమాలు చేస్తూ పోతే అంతే సంగతులు. సల్మాన్ ఖాన్ ఇదే దారిలో పయనిస్తున్నాడు. భాయ్ సినిమాలంటే ఎంత పేలవమైన టాక్ వచ్చినా వసూళ్లకు ఢోకా ఉండదనే అభిప్రాయం ఉంది. కానీ మరీ చెత్త సినిమాలు చేస్తే అభిమానులు సైతం నిరాశకు గురై హీరో మీద గురి కోల్పోవడం ఖాయం.

‘రాధె’ కనుక థియేటర్లలో రిలీజై ఉండే.. దీనికి వచ్చిన టాక్‌కు తొలి రోజే బాక్సులు లేచిపోయేవి. రెండో రోజు నుంచి థియేటర్లు వెలవెలబోయేవి. ఓపెనింగ్స్‌ కూడా ఆశించిన స్థాయిలో వచ్చేవి కావు. ఓటీటీ రిలీజ్, పైగా ఎక్కువ రేటు పెట్టడం వల్ల తొలి రోజే బాగా సొమ్ము చేసుకున్నారు. ఓవరాల్‌గా ఈ సినిమా ‘సక్సెస్ ఫుల్’ అనిపించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ థియేటర్లలో రిలీజై ఉంటే మాత్రం డిజాస్టర్ అయ్యేది ఖాయంగా. ఐతే ఇంతకుముందు రేస్-3, దబంగ్.. ఇప్పుడు రాధె లాంటి సినిమాలతో సల్మాన్ ప్రేక్షకుల్లో నమ్మకం కోల్పోతున్నాడు. షారుఖ్ ఖాన్ ఇలాగే చెత్త సినిమాలు చేసి మార్కెట్ మొత్తం కోల్పోయాడు. ‘రాధె’ లాంటి సినిమాలు ఇంకా ఒకట్రెండు చేశాడంటే షారుఖ్ పరిస్థితే సల్మాన్‌కూ తలెత్తడం ఖాయం.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)