కరోనా విరామం తర్వాత ఇండియాలోని థియేటర్లలో రిలీజైన భారీ చిత్రాలు రెండు. ఒకటి మాస్టర్ అయితే.. ఇంకోటి వకీల్ సాబ్. ఈ రెండు చిత్రాలూ థియేటర్లలో అంచనాలను మించి ఆడేశాయి. ఐతే ‘మాస్టర్’ సినిమా ఇంకా థియేటర్లలో నడుస్తుండగానే ఆ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేసేయడం తెలిసిన సంగతే. విడుదలైన రెండు వారాలకే ఆ సినిమాను ఓటీటీలో వదిలేశారు. దీని పట్ల అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి.
ఇలాంటి పెద్ద సినిమాలను ఇంత త్వరగా ఓటీటీలో రిలీజ్ చేయడం థియేటర్లకు గొడ్డలి పెట్టు అన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ ఒక సినిమా మీద భారీ బడ్జెట్ పెట్టిన నిర్మాతకు.. దాన్ని ఎప్పుడు ఎక్కడ రిలీజ్ చేసుకోవాలన్న హక్కు ఉంటుంది. తనకు ఉత్తమ ప్రయోజనం దక్కేలా డీల్స్ చేసుకోవడం తన ఇష్టమన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అప్పుడు. ‘మాస్టర్’ సంగతలా వదిలేస్తే ఇప్పుడు మరో భారీ చిత్రం ‘వకీల్ సాబ్’ను సైతం థియేటర్లలో విడుదలైన 20 రోజులకే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటన రావడం చర్చనీయాంశంగా మారింది.
‘వకీల్ సాబ్’ రిలీజైన తొలి వారంలోనే దీని ఓటీటీ రిలీజ్ గురించి ఒక పుకారు నడిచింది. ఈ నెల 23నే సినిమా ప్రైమ్‌లోకి వచ్చేస్తుందంటూ గట్టిగానే ప్రచారం సాగింది. దీనిపై నిర్మాత దిల్ రాజు స్వయంగా స్పందించాడు. ‘వకీల్ సాబ్’ ఓటీటీలోకి ఇప్పుడిప్పుడే రాదన్నాడు. థియేటర్లలో రిలీజైన 50 రోజుల తర్వాతే ఓటీటీ రిలీజ్ అంటూ చిత్ర వర్గాలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగించాయి. కట్ చేస్తే ఇప్పుడేమో 20 రోజులకే ప్రైమ్‌లోకి వదిలేస్తున్నారు. ఇలా సినిమా రిలీజైనపుడు, ముందు ఒక మాట చెప్పి.. ఆ తర్వాత అనుకున్నదానికంటే ముందే ఓటీటీలో రిలీజ్ చేయడం మొదలుపెడితే.. జనాలకు నమ్మకం పోతుందని.. మున్ముందు థియేటర్లకు రావడం తగ్గించేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పెద్ద సినిమాల విషయంలో థియేట్రికల్ రిలీజ్‌కు, ఓటీటీ రిలీజ్‌కు కనీసం నెల రోజుల గ్యాప్ ఉండేలా చూడాలని కూడా అంటున్నారు. ఐతే నిజానికి ‘వకీల్ సాబ్’ థియేటర్లలో వచ్చిన నెల రోజుల తర్వాతే ప్రైమ్‌లోకి వదలాలని అనుకున్నారు కానీ.. గత కొన్ని రోజులు వేగంగా పరిస్థితులు మారిపోవడం.. కరోనా, ఇతర కారణాలతో చాలా ముందే ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిపోవడంతో.. ఓటీటీ రిలీజ్ ఎక్కువ రోజులు ఆపడం వల్ల ప్రయోజనం ఏమీ లేదని భావించి డీల్ రివైజ్ చేసి కాస్త ముందే సినిమాను ప్రైమ్‌లో రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం.