ఇందుకే సోనూసూద్ నేషనల్ హీరో అయ్యింది

సినిమాల్లో హీరోలుగా నటించేవాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ సినిమాల్లో విలన్ గా నటిస్తు నిజజీవితంలో హీరో అనిపించుకుంటున్నది మాత్రం సోనూసూదే. ఆమధ్య బాలివుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా భారీఎత్తున విరాళం ఇచ్చాడు కానీ సోనూ చేస్తున్నట్లు కార్యక్రమాలు మాత్రం చేయలేదు. ఎంతైనా దేశంలోని మిగిలిన సినీ సెలబ్రిటీలతో పోల్చుకుంటే సోనీసూద్ డిఫరెంట్ అనిపించకున్నాడు.

ఇదంతా ఇపుడెందుకంటే తాజాగ ఓ పేషంట్ ను బతికించేందుకు పడిన తపని చూసి యావత్ దేశం ఫిదా అయిపోయింది. నాగ్ పూర్ కు చెందిన భారతి అనే మహిళను వైద్య చికిత్సకోసం సోనూసూద్ ఏకంగా హైదరాబాద్ కు ఎయిర్ హెలికాప్టర్ ద్వారా తరలించారు. విషయం ఏమిటంటే నాగ్ పూర్లో భారతికి కరోనా సోకింది. దాంతో ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయాయి. కరోనా కారణంగా ఆమె ఊపిరితిత్తులు దాదాపు 90 శాతం దెబ్బతిన్నాయి.

అసలు ఆమెను కరోనా వచ్చినపుడు నాగ్ పూర్ ఆసుపత్రిలో చేర్చింది కూడా సోనూనే. అప్పటినుండి ఆమె ఆరోగ్యపరిస్ధితని సోను తెలుసుకుంటునే ఉన్నారట. తాజాగా ఆమె ఆరోగ్య పరిస్ధితి వికటించినట్లు డాక్టర్లు సూద్ కు చెప్పారు. ఊపిరితిత్తుల ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగితే కూడా బతికే అవకాశం 20 శాతం మాత్రమే అని కూడా డాక్టర్లు తేల్చేశారు. అయితే ఓ మనిషికి బతికేఛాన్స్ 20 శాతం ఉన్నపుడు ఎందుకు చాన్స్ తీసుకోకూడదని సోనూ అనుకున్నారు.

ఊపిరితిత్తుల మార్పిడి హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో మాత్రమే జరుగుతుందని కూడా డాక్టర్లు చెప్పారట. వెంటనే సోనూ సూచనల ప్రకారం నాగ్ పూర్ డాక్టర్లు హైదరాబాద్ అపోలో డాక్టర్లకు ఫోన్ చేసి విషయమంతా వివరించారు. దాంతో పరిస్ధితిని అర్ధంచేసుకున్న అపోలో డాక్టర్లు వెంటనే పేషంటును పంపమన్నారట. నాగ్ పూర్ నుండి హైదరాబాద్ కు పంపటం ఎలాగ ? అనే సమస్య వచ్చింది.

వెంటనే సోనూ ఓ ఎయిర్ హెలికాప్టర్ ను మాట్లాడి వైద్యులతో పాటు పేషంటును హైదరాబాద్ కు తరలించేశారు. ఓ పేషంటుకు బతికే అవకాశం ఉన్నపుడు ప్రయత్నించకపోవటం దారుణమని సోనూకి అనిపించింది. అందుకనే అంతటి ప్రయత్నంచేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, నెటిజన్లు ఫుల్లుగా సోనూ నిర్ణయానికి, ఔదార్యానికి ఫిదా అయిపోయారు.