క‌ళ్లు చెదిరే డీల్‌.. టెంప్ట్ కాని అఖండ టీం

నంద‌మూరి బాల‌కృష్ణకు ఈ త‌రం యువ‌త‌లో ఫాలోయింగ్ కొంచెం త‌క్కువే. బాల‌య్య అభిమానుల్లో చాలా వ‌ర‌కు నిన్న‌టిత‌రానికి చెందిన వాళ్లే కావ‌డంతో సోష‌ల్ మీడియాలో బాల‌య్య సినిమాల గురించి పెద్ద‌గా హ‌డావుడి క‌నిపించ‌దు. డైహార్డ్ నంద‌మూరి ఫ్యాన్స్ త‌ప్పితే బాల‌య్య సినిమాల గురించి చ‌ర్చించేవాళ్లు త‌క్కువే. అందులోనూ గ‌త ద‌శాబ్ద కాలంలో బాల‌య్య సినిమాల స‌క్సెస్ రేట్ బాగా త‌గ్గిపోయింది.

ముఖ్యంగా య‌న్.టి.ఆర్, రూల‌ర్ సినిమాల ఫ‌లితాలు చూశాక బాల‌య్య కెరీరే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్లు క‌నిపించింది. కానీ ఇలాంటి త‌రుణంలో బోయ‌పాటి శ్రీనుతో సినిమా చేయ‌డం ద్వారా బాల‌య్య తెలివైన నిర్ణ‌య‌మే తీసుకున్నాడు. ఈ కాంబినేష‌న్‌కున్న క్రేజ్ సినిమాకు బాగా క‌లిసొచ్చింది. ఇప్ప‌టిదాకా రిలీజ్ చేసిన రెండు టీజ‌ర్లూ సినిమాకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ఇటీవ‌ల వ‌దిలిన టైటిల్ రోర్ వీడియో అయితే సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

ఈ నేప‌థ్యంలో బాల‌య్య కెరీర్లోనూ ఎన్న‌డూ లేని స్థాయిలో ఈ సినిమాకు బిజినెస్ జ‌రిగే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. అఖండ నాన్ థియేట్రిక‌ల్ హ‌క్కులు ఏకంగా రూ.15 కోట్లు ప‌లికిన‌ట్లు ఇటీవ‌ల వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. కాగా ప్ర‌స్తుత కోవిడ్ ప‌రిస్థితులు నేప‌థ్యంలో కొత్త చిత్రాల థియేట్రిక‌ల్ రిలీజ్‌పై సందేహాలు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఈ చిత్రాన్ని నేరుగా డిజిట‌ల్లో రిలీజ్ చేసేందుకు ఒక టాప్ ఓటీటీ ఫ్లాట్ చిత్ర బృందానికి భారీ ఆఫ‌ర్ ఇచ్చింద‌ట‌. ఏకంగా రూ.60 కోట్ల‌కు పైగా చెల్లించేందుకు ముందుకొచ్చింద‌ట‌.

ప్ర‌స్తుత‌ త‌రుణంలో బాల‌య్య సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌కు ఇంత రేటు రావ‌డం అనూహ్యం. కానీ బాల‌య్య‌-బోయ‌పాటి సినిమాపై ఉన్న అంచ‌నాల దృష్ట్యా మంచి టైమింగ్‌లో సినిమాను రిలీజ్ చేస్తే వ‌సూళ్ల మోత మోగిపోతుంద‌ని.. అభిమానులు ఎంత‌గానో ఎదురు చూస్తున్న సినిమాను డిజిట‌ల్లో రిలీజ్ చేయ‌డం స‌రికాద‌ని భావించి ఈ టెంప్టింగ్ ఆఫ‌ర్‌కు టీం నో చెప్పేసింద‌ట‌. వాస్త‌వంగా అయితే మే 28న ఈ సినిమా విడుద‌ల కావాలి కానీ.. క‌రోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో ఆ రోజు సినిమా రావ‌డం సందేహ‌మే.