వివేక్ అన్నంతనే తెలుగు ప్రేక్షకులు గుర్తు తెచ్చుకోకపోవచ్చు. కానీ.. అతడ్ని చూసినంతనే ముఖాన నవ్వు వచ్చేస్తుంది. అంతలా తెలుగు ప్రజలకు కనెక్టు అయిన హాస్యనటుడు ఆయన. తమిళ హాస్య నటుడిగా గుర్తింపు పొందిన ఆయన ఇక లేరు. అనూహ్యంగా చోటు చేసుకున్న అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన.. ఈ రోజు (శనివారం) ఉదయం తుదిశ్వాస విడిచారు. అభిమానుల్ని శోక సంద్రంలో ముంచేశారు.
దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించిన వివేక.. ఎంతటి స్టార్ హీరో చిత్రమైనా.. ఆయన మాత్రం తప్పకుండా ఉండాల్సిందే. అంతటి డిమాండ్ ఉన్న ఆయన.. శుక్రవారం ఉదయం అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటిన చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులుపేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ రోజు ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్లుగా వైద్యులు వెల్లడించటంతో తమిళ చిత్ర పరిశ్రమ షాక్ కు గురైంది. దిగ్గజ దర్శకుడు బాలచందర్ పరిచయం చేసిన నటుల్లో వివేక్ ఒకరు.
రజనీకాంత్.. కమల్ హాసన్.. విజయ్.. అజిత్.. సూర్య.. ఇలా ఒకరేమిటి? అగ్రహీరోల చిత్రాల్లో ఆయన తప్పనిసరిగా ఉండేవారు. తమిళ చిత్రాలు డబ్బింగ్ కావటంతో.. తెలుగు ప్రేక్షకులకు ఆయన సుపరిచితులు. అనూహ్యమైన విషయం ఏమంటే.. గురువారం చెన్నైలో వ్యాక్సిన్ వేయించుకున్న ఆయన.. అందరూ టీకాలు వేయించుకోవాలని పిలుపునిచ్చారు. అంతలా ఆరోగ్యంగా ఉన్న ఆయన..అనూహ్యంగా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవటం షాకింగ్ గా మారింది. ఆయన మరణం ఎవరికీ మింగుడుపడనిదిగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates