టక్ జగదీష్ వాయిదా.. కానీ కారణం వేరు

అనుకున్నదే జరిగింది. అనుమానాలు నిజమయ్యాయి. వేసవిలో రావాల్సిన మరో పేరున్న సినిమా వాయిదా పడింది. ఏప్రిల్ 23న విడుదల కావాల్సిన నాని సినిమా ‘టక్ జగదీష్’ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వారం రిలీజ్ కావాల్సిన ‘లవ్ స్టోరి’ని ఇప్పటికే వాయిదా వేస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి తర్వాతి వారానికి షఎడ్యూల్ అయిన ‘టక్ జగదీష్’ విషయంలో సస్పెన్స్ మొదలైంది.

కరోనా సెకండ్ వేవ్ అంతకంతకూ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా వాయిదా పడటం అనివార్యం అన్న అభిప్రాయాలు వినిపించాయి. ఐతే ఇంకో నాలుగైదు రోజులు చూసి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారని భావించారు. కానీ అంత వరకు ఎదురు చూడకుండా వాయిదా నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించామని.. రిలీజ్ డేట్ తర్వాత ప్రకటిస్తామని నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది.

ఐతే కేవలం కరోనా సెకండ్ వేవ్ మాత్రమే ‘టక్ జగదీష్’ వాయిదా కారణం కాదని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్లుండి టికెట్ల ధరలపై నియంత్రణ రావడం, తొలి వారం టికెట్ల రేట్లు పెంపును అడ్డుకోవడానికి తోడు.. పదేళ్ల కిందటి ధరల పట్టిక తీసుకొచ్చి ఆ ప్రకారమే టికెట్లు అమ్మాలని స్పష్టం చేస్తుండటం.. అలా కాని పక్షంలో థియేటర్లను మూసి వేయిస్తుండటం పట్ల బయ్యర్లు, ఎగ్జిబిటర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది.

ఈ రేట్లతో థియేటర్లను నడపడం కష్టమని నగర పంచాయితీలు, గ్రామ పంచాయితీల పరిధిలో ఎగ్జిబిటర్లు స్వచ్ఛందంగా థియేటర్లను మూసేస్తుండటంతో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. తాము పెట్టిన పెట్టుబడులను ఈ రేట్లతో వెనక్కి రాబట్టుకోవడం కష్టమని బయ్యర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ గొడవ సద్దుమణిగి.. ప్రభుత్వ వైఖరి మారే వరకు వేచి చూడాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే కొత్త సినిమాల విడుదలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఎలాగూ కరోనా కూడా అడ్డంకిగా మారడం, మళ్లీ 50 శాతం ఆక్యుపెన్సీని అమల్లో పెట్టే సూచనలు కనిపిస్తుండటంతో ‘టక్ జగదీష్’ను వాయిదా వేయక తప్పని పరిస్థితి నెలకొంది. చూస్తుంటే ఆ తర్వాతి వారాలకు షెడ్యూల్ అయిన సినిమాలు కూడా అనుకున్న ప్రకారం రిలీజవడం కష్టంగానే ఉంది.