దర్శక రత్న దాసరి నారాయణరావు మరణానంతరం ఖాళీ అయిపోయిన ఇండస్ట్రీ పెద్ద స్థానాన్ని కొంత కాలానికి మెగాస్టార్ చిరంజీవి భర్తీ చేశారు. దాసరి తర్వాత ఆ స్థానంలో ఉండటానికి చిరును మించిన ప్రత్యామ్నాయం ఎవరికీ కనిపించలేదు.
దాసరిలాగా ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుని అందరికీ అండగా నిలవడం సాధ్యం కాదు కానీ.. చిరు ఉన్నంతలో ఇండస్ట్రీలో సమస్యలు, వివాదాల్ని పరిష్కరించడానికి, తన వంతుగా ఏదైనా సాయం చేయడానికి ముందుకు వస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ మధ్య మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో వివాదం తలెత్తితే చిరు జోక్యం చేసుకున్నారు. నరేష్-రాజశేఖర్ మధ్య తలెత్తిన వివాదం సద్దుమణిగేలా చేయడం తెలిసిన సంగతే.
ఆ వివాద సమయంలో ఆ సంఘానికి సంబంధించి క్రమశిక్షణ సంఘం ఒకటి ఏర్పాటు చేశారు. ఇకపై ఇలాంటి వివాదాలు తలెత్తితే వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత చిరు అండ్ కో తీసుకుంది. చిరంజీవితో పాటు కృష్ణంరాజు, మోహన్‌బాబు, మురళీమోహన్ జయసుధ ఇందులో సభ్యులు. ఐతే ఇప్పుడు ఈ సంఘం నుంచి చిరంజీవి తప్పుకున్నట్లుగా సమాచారం బయటికి వచ్చింది. క్రమశిక్షణ సంఘం యాక్టివ్‌గా లేకపోవడం వల్ల చిరు అందులోంచి తప్పుకున్నారా.. లేక ఈ గొడవ నాకెందుకు అనుకున్నారా అన్నది తెలియదు.
మొత్తానికి చిరు అయితే మా క్రమశిక్షణ సంఘం నుంచి బయటికి వచ్చేశారంటున్నారు. కొంత కాలంగా ‘మా’ లో పెద్దగా కార్యక్రమాలేవీ జరగట్లేదు. మరోవైపు ‘మా’ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. ఈ సమయంలో ఇన్నాళ్లూ ‘మా’ వ్యవహారాల్లో చురుకుగా వ్యవహరించిన చిరంజీవి క్రమశిక్షణా సంఘానికి ఎందుకు రాజీనామా చేశారో.. దీనిపై మా పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.