ఆ ప‌వ‌ర్ స్టార్ సాధించాడు.. మ‌న ప‌వ‌ర్ స్టార్‌కు కోతే

క‌న్న‌డ‌నాట సినీ రంగంలో నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. క‌ర్ణాట‌క థియేట‌ర్లు మొన్న‌టిదాకా 100 శాతం ఆక్యుపెన్సీతోనే న‌డుస్తుండ‌గా.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్క‌డి ప్ర‌భుత్వం థియేటర్లలో ఆక్యుపెన్సీని ఉన్నట్లుండి 50 శాతానికి తగ్గించేసింది. ఈ ప్ర‌భావం కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సినిమా ‘యువ‌ర‌త్న’ మీద గ‌ట్టిగా ప‌డింది.

తొలి రోజు వంద శాతం ఆక్యుపెన్సీతో నడిచి వెంటనే దాన్ని 50 శాతానికి తగ్గించేయడంతో ‘యువరత్న’ టీం షాక్‌కు గురైంది. పునీత్ మాత్రమే కాదు.. శాండిల్‌వుడ్ హీరోలు చాలామంది ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆల్రెడీ వీకెండ్ మొత్తానికి వంద శాతానికి బుకింగ్స్ అయిపోయాక ఇలా ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గిస్తే ఎలా అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఈ విషయమై పునీత్ సహా చిత్ర బృందంలోని కీలక వ్యక్తులంతా కలిసి ఏకంగా ముఖ్యమంత్రి యడ్యూరప్ప దగ్గరికే వెళ్లిపోయారు.

ప్రభుత్వ నిర్ణయంపై పునరాలోచించాలని కోరగా. యడ్యూరప్ప వారిని కరుణించారు. ఇప్పటికే బుకింగ్స్ జరిగిపోయిన నేపథ్యంలో 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయాన్ని అమలు చేయడం కష్టమని భావించి.. 100 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడిపేలా జీవో ఇచ్చారు. కానీ అందులో చిన్న మెలిక పెట్టారు. ఈ నిర్ణయం ఈ మంగళవారం వరకు మాత్రమే కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ నెల 7, బుధవారం నుంచి 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

ఇది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ సినిమా ‘వకీల్ సాబ్’కు పెద్ద ఎదురు దెబ్బే. పవన్ సినిమాలు కర్ణాటకలో భారీ వసూళ్లు సాధిస్తాయన్న సంగతి తెలిసిందే. పది కోట్లకు పైగా షేర్ సాధించే స్టామినా పవన్‌కు ఉంది. కానీ ఇప్పుడు 50 శాతానికి ఆక్యుపెన్సీని తగ్గించేస్తుండటంతో ఈ శుక్రవారం విడుదలయ్యే ఈ చిత్రానికి పెద్ద డెంట్ పడ్డట్లే.