ఈ శుక్రవారం రిలీజైన రెండు సినిమాల్లో మంచి టాక్ తెచ్చుకున్నది అక్కినేని నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ మూవీనే. దీనికి పోటీగా విడుదలైన ‘సుల్తాన్’కు నెగెటివ్ టాక్ వచ్చింది. ఇక కార్తితో పోలిస్తే నాగార్జున పెద్ద హీరో. పైగా కార్తి మన హీరో కూడా కాదు. ఇలా ఏ రకంగా చూసినా ‘వైల్డ్ డాగ్’ది బాక్సాఫీస్ దగ్గర పైచేయి కావాలి. కానీ ఆశ్చర్యకరంగా శుక్రవారం ‘వైల్డ్ డాగ్’ మీద ‘సుల్తాన్’ పైచేయి సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో పలు ఏరియాల్లో ‘వైల్డ్ డాగ్’ కన్నా ‘సుల్తాన్’కు ఎక్కువ వసూళ్లు రావడం ఆశ్చర్యం కలిగించే విషయం.
ఓవరాల్ కలెక్షన్లలో ‘వైల్డ్ డాగ్’ కాస్త పైచేయి సాధించింది. కానీ అంతరం పెద్దగా లేదు. నాగ్ గత సినిమాల ప్రభావం వల్లో ఏమో.. ‘వైల్డ్ డాగ్’ మంచి టాక్ తెచ్చుకుని కూడా తొలి రోజు చాలా తక్కువ షేర్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపితే డే-1 షేర్ రూ.1.21 కోట్లకు పరిమితమవడం షాకింగ్‌గా అనిపిస్తోంది. నాగ్ రేంజి స్టార్లలో ఎవరి సినిమాలకూ గత కొన్నేళ్లలో తొలి రోజు ఇంత తక్కువ షేర్ రాలేదు.
అదే సమయంలో ‘సుల్తాన్’కు తొలి రోజు రూ.1.15 కోట్ల షేర్ వచ్చింది. ఒక డబ్బింగ్ సినిమాకు తొలి రోజు ఇంత షేర్ రావడం గొప్ప విషయమే. అందులోనూ ఒక పెద్ద స్టార్ సినిమాతో పోటీ పడుతూ.. నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాకు ఈ షేర్ చిన్నదేమీ కాదు. నిన్న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మెయిన్ థియేటర్లలో ప్రతి షోకూ ‘వైల్డ్ డాగ్’ కంటే ‘సుల్తాన్’కు ఎక్కువ షేర్ రావడం గమనార్హం. ఏపీ, తెలంగాణల్లో పలు ఏరియాల్లో ‘వైల్డ్ డాగ్’ కన్నా ‘సుల్తాన్’కు షేర్ ఎక్కువ వచ్చింది.
వచ్చే వారం ‘వకీల్ సాబ్’ రానున్న నేపథ్యంలో నాగ్ మూవీ ఏం సాధించినా ఈ వారమే సాధించాలి. మంచి టాక్‌ను వసూళ్లుగా మలుచుకుని తొలి వారాంతంలో మాగ్జిమమ్ వసూళ్లు రాబట్టకపోతే.. ఓటీటీ డీల్ క్యాన్సిల్ చేసుకుని ‘వైల్డ్ డాగ్’ను థియేటర్లలో రిలీజ్ చేయడంలో అర్థం ఉండదు. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు కచ్చితంగా వసూళ్లు పెరుగుతాయని చిత్ర బృందం ఆశిస్తోంది. వీకెండ్ కలిసొస్తుందన్న అంచనాలున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.