ఆమెను దాచేసిన వ‌కీల్ సాబ్‌


అభిమానుల నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ వ‌కీల్ సాబ్ ట్రైల‌ర్‌తో ప‌ల‌క‌రించాడు. పింక్ సినిమాను చెడ‌గొట్టేశార‌ని.. పింక్‌కు ప్ర‌ధాన బ‌లంగా నిలిచిన స‌మ‌స్య మ‌రుగున ప‌డిపోయింద‌ని ఇన్నాళ్లూ గ‌గ్గోలు పెట్టిన వాళ్లంద‌రూ ట్రైల‌ర్ చూశాక కొంచెం శాంతించే ఉంటారు. ఎందుకంటే ఈ ఒరిజిన‌ల్లో కీల‌కంగా ఉన్న ఎపిసోడ్ల‌న్నీ వ‌కీల్ సాబ్‌లో కూడా కొన‌సాగించార‌ని.. ఆ విష‌యాన్ని ప‌లుచ‌న చేసే ప్ర‌య‌త్నం ఏదీ జ‌ర‌గ‌లేద‌ని స్ప‌ష్ట‌మైంది.

ఇంత‌కుముందు టీజ‌ర్ స‌హా ప్రోమోలన్నీ కూడా పవ‌న్ చుట్టూనే తిరిగాయి. అమ్మాయిల‌కు.. క‌థాంశానికి చోటెక్క‌డ అన్న ప్ర‌శ్న‌లు రేకెత్తించాయి. కానీ ట్రైల‌ర్లో మాత్రం పింక్‌లో కీల‌కంగా అనిపించిన స‌న్నివేశాల‌న్నీ క‌నిపించాయి. ఈ సినిమా క‌థాంశాన్ని చెడ‌గొట్ట‌డం లాంటిదేమీ జ‌ర‌గ‌లేద‌ని స్ప‌ష్ట‌మైంది.

పింక్‌లో చూసిందంతా కొన‌సాగిస్తూనే.. ప‌వ‌న్ ఇమేజ్‌కు త‌గ్గ అద‌న‌పు ఎపిసోడ్లు సినిమాలో చూడ‌బోతున్నామ‌ని స్ప‌ష్ట‌మైంది. ఆ అద‌న‌పు ఎపిసోడ్ల గురించి ట్రైల‌ర్లో పెద్ద‌గా సంకేతాలు ఇవ్వ‌లేదు. ముఖ్యంగా కొత్త‌గా చేర్చిన‌ ప‌వ‌న్ ఫ్లాష్ బ్యాక్ మొత్తాన్ని స‌ర్ప్రైజ్ లాగా దాచి పెట్టేశారు. శ్రుతి హాస‌న్‌కు ట్రైల‌ర్లో అసలు చోటే లేక‌పోయింది. ఆమె కానీ.. ఆమెతో ముడిప‌డ్డ‌ చిన్న షాట్ కూడా లేకుండా చూసుకున్నాడు వేణు శ్రీరామ్.

ఇది కొంత‌మందిని నిరాశ ప‌రిచినా.. అలా స‌ర్ప్రైజ్ లాగా దాచిపెట్ట‌డం మంచిదే అని మిగ‌తా వాళ్లంటున్నారు. క‌థ ప‌రంగా అది సెకండ‌రీ కాబ‌ట్టి దాన్ని ట్రైల‌ర్లో చూపించాల్సిన అవ‌స‌రం లేద‌నుకుని కూడా ఉండొచ్చు. పింక్ సినిమాను చెడ‌గొట్ట‌డం లాంటిదేమీ జ‌ర‌గ‌లేద‌ని.. ప్ర‌ధానంగా సినిమా ఒరిజిన‌ల్‌ను ఫాలో అయ్యేలాగే ఉంటుంద‌ని ట్రైల‌ర్ ద్వారా సంకేతాలిచ్చిన‌ట్లున్నారు.