ట్రైల‌ర్ రిలీజ్‌కే ఇంత హంగామా అంటే..


ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా రిలీజ్ అంటే మామూలుగానే ఎంత హంగామా ఉంటుందో తెలిసిందే. అందులోనూ ప‌వ‌న్ మూడేళ్ల విరామం త‌ర్వాత రీఎంట్రీ ఇస్తుండ‌టంతో వ‌కీల్ సాబ్ మీద హైప్ మామూలుగా లేదు. ప‌వ‌న్‌ను వెండితెర‌పై చూసేందుకు అభిమానులు ఎంత‌గా ఎదురు చూస్తున్నారో చెప్ప‌డానికి వ‌కీల్ సాబ్ ట్రైల‌ర్ లాంచ్ సంద‌ర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నెల‌కొన్న హంగామానే నిద‌ర్శ‌నం.

రెండు నిమిషాల ట్రైల‌ర్ లాంచ్ కోసం ఏపీ, తెలంగాణ‌ల్లో పెద్ద ఎత్తున థియేట‌ర్లు ముస్తాబ‌య్యాయి. అభిమానులు పెద్ద సంఖ్య‌లో థియేట‌ర్ల‌కు చేరుకుని సంబ‌రాలు చేశారు. బ్యాండ్ మేళాలు పెట్టారు. ట‌పాసులు పేల్చారు. ఫ్లెక్సీలు పెట్టారు. డ్యాన్సులేసి నానా హంగామా చేశారు. థియేట‌ర్ల లోప‌ల అయితే హ‌డావుడి మామూలుగా లేదు. బ‌స్తాల్లో పేప‌ర్లు తీసుకెళ్లి ట్రైల‌ర్‌ను సెల‌బ్రేట్ చేశారు. కొత్త సినిమా రిలీజ్ స్థాయిలో హంగామా క‌నిపించింది.

హైద‌రాబాద్ సుద‌ర్శ‌న్ థియేట‌ర్‌కు స్వ‌యంగా వ‌కీల్ సాబ్ ద‌ర్శ‌క నిర్మాత‌లు వేణు శ్రీరామ్.. దిల్ రాజు, శిరీష్ వెళ్లి ట్రైల‌ర్ లాంచ్ చేశారు. అక్క‌డ అభిమానుల సంద‌డి చూస్తే ఇదేం క్రేజ్ బాబోయ్ అని అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయే ప‌రిస్థితి క‌నిపించింది. కేవ‌లం ట్రైల‌ర్ లాంచ్‌కే ఇంత సంద‌డి చేసిన అభిమానులు.. ఇక రిలీజ్ రోజు చేయ‌బోయే హంగామాను త‌లుచుకుంటేనే ఊహ‌లు ఎక్క‌డికో వెళ్లిపోతున్నాయి.

వ‌కీల్ సాబ్ ట్రైల‌ర్ లాంచ్ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలోనూ హంగామా మామూలుగా లేదు. తెలుగు సినీ ప్రియుల చ‌ర్చ‌ల‌న్నీ ఈ సినిమా చుట్టూనే తిరుగుతున్నాయి. అంద‌రి టైమ్ లైన్లూ వ‌కీల్ సాబ్ ముచ్చ‌ట్ల‌తోనే నిండిపోతున్నాయి. ఈ ఉత్సాహం చూస్తుంటే ఏప్రిల్ 9న సంద‌డి మామూలుగా ఉండ‌బోద‌ని అర్థ‌మ‌వుతోంది.