2020 వేసవిలో రావాల్సిన సినిమా అరణ్య. ఈ సినిమా అంతకు రెండేళ్ల ముందు మొదలైంది. బాహుబలి-ది కంక్లూజన్ పూర్తయ్యాక ఈ చిత్రాన్ని మొదలుపెట్టాడు రానా దగ్గుబాటి. కానీ అతడి అనారోగ్య సమస్యల వల్ల, అలాగే అటవీ లొకేషన్లలో భారీ స్థాయిలో ఈ సినిమా తీయాల్సి రావడం వల్ల బాగా ఆలస్యం జరిగింది. చివరికి సినిమాను విడుదలకు సిద్ధం చేశాక.. కరోనా వచ్చి బ్రేకులేసింది. ఏడాది పాటు సినిమాను ఆపి ఎట్టకేలకు మార్చి 26న విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు.
తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కావాల్సి ఉంది. కానీ విడుదలకు ఇంకో మూడు రోజులే ఉండగా.. నిర్మాతలు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రంలో భాగస్వామి అయిన ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ హిందీ వెర్షన్ విడుదలను వాయిదా వేసేసింది. ఈ మేరకు ప్రెస్ నోట్ కూడా ఇచ్చింది.
హిందీ సినిమాలకు కేంద్ర స్థానం అయిన మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. ఉత్తరాదిన మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా ప్రభావం ఎక్కువై అనేక చోట్ల సినిమాల ప్రదర్శన ఆపేస్తున్నారు. లేదా సగం ఆక్యుపెన్సీకి పరిమితం చేస్తున్నారు. జనాలు ఇళ్లు దాటి బయటికి రావడానికి భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో హిందీ సినిమాల పరిస్థితి దారుణంగా ఉంది.
ముంబయి సెగా చిత్రం మంచి టాక్ తెచ్చుకుని కూడా వసూళ్లు రాబట్టలేకపోతోంది. సాధారణ సమయాల్లో వచ్చే వసూళ్లతో పోలిస్తే దీనికి 40 శాతం కలెక్షన్లు మాత్రమే వచ్చాయి వీకెండ్లో. ఈ పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేయడం అంటే చేజేతులా చంపుకోవడమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకాలం ఆపి, ఇలాంటి స్థితిలో హాథీ మేరీ సాథీని రిస్క్ చేసి రిలీజ్ చేయడం మంచిది కాదని ఈరోస్ సంస్థ నిర్ణయించుకుంది. తెలుగు, తమిళ భాషల్లో మాత్రం ఈ సినిమా యధావిధిగా రిలీజవుతుందని, హిందీ రిలీజ్ గురించి తర్వాత వెల్లడిస్తామని ఆ సంస్థ పేర్కొంది.