తమిళ సినీ పరిశ్రమను విషాదంలో ముంచెత్తుతూ జననాథన్ అనే మంచి అభిరుచి ఉన్న, సీనియర్ దర్శకుడు మూడు రోజుల కిందటే మృతి చెందాడు. ఈయన విజయ్ సేతుపతి, శ్రుతి హాసన్, జగపతిబాబుల కలయికలో లాభం అనే సినిమా తీశాడు ఈ మధ్యే. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగానే హఠాత్తుగా అనారోగ్యం పాలై ప్రాణాలు విడిచారు.
ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తేల్చారు. ఇంకో మూడు రోజులకే, అంటే మార్చి 14న ఆయన తుది శ్వాస విడిచారు. ఆ రోజే అంత్యక్రియలు జరిగాయి. ఐతే మరో మూడు రోజులకే జననాథన్ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరి లక్ష్మి గుండెపోటుతో బుధవారం మరణించడం అందరినీ కలచి వేస్తోంది.
లక్ష్మి జననాథన్ అంత్యక్రియల్లోనూ పాల్గొంది. ఆమె ఆ రోజు తీవ్ర విషాదంలో మునిగిపోయినట్లు సన్నిహితులు చెబుతున్నారు. సోదరుడి మరణాన్ని తట్టుకోలేకే లక్ష్మి గుండెపోటుకు గురై ఉండొచ్చని భావిస్తున్నారు. జననాథన్ మృతినే తట్టుకోలేకపోతున్న ఆ కుటుంబం.. ఆయన సోదరిని కూడా కోల్పోవడంతో మరింత విషాదంలో మునిగిపోయింది.
ఇదిలా ఉండగా జననాథన్ చివరి సినిమాలో కథానాయకుడిగా నటించిన విజయ్ సేతుపతి తన దర్శకుడి కుటుంబానికి అండగా నిలిచిన వైనం ప్రశంసలందుకుంటోంది. జననాథన్ ఆసుపత్రి ఖర్చులన్నీ అతనే చూసుకోవడమే కాదు.. అంత్యక్రియల బాధ్యత కూడా అతనే తీసుకున్నాడట. వేరే సినిమా షూటింగ్‌లో ఉన్నవాడు.. జననాథన్‌కు పరిస్థితి విషమం కాగానే ఆసుపత్రికి వచ్చేసి ఆయన చనిపోయాక అంత్యక్రియలన్నీ పూర్తయ్యే వరకు ఆ కుటుంబానికి తోడుగా ఉన్నట్లు సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates