శంకర్-చరణ్ సినిమా ఆయన చేతికి..


రామ్ చరణ్ ఓవైపు తాను హీరోగా నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ పనిలో, మరోవైపు క్యామియో రోల్ చేస్తున్న ‘ఆచార్య’కు సంబంధించిన షూటింగ్‌లో బిజీగా బిజీగా గడిపేస్తున్నాడు. ఇంకోవైపేమో అతడి కొత్త చిత్రానికి చకచకా సన్నాహాలు జరిగిపోతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించబోయే సినిమాకు తమిళ గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కాస్ట్ అండ్ క్రూను ఖరారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు శంకర్, నిర్మాత దిల్ రాజు.

ఈ సినిమాలో ఓ కథానాయిక పాత్ర కోసం కొరియన్ పాప్ సింగర్ సుజీ బేను సంప్రదిస్తున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో మరో కథానాయికగా కియారా అద్వానీ నటిస్తుందనే ప్రచారమూ సాగుతోంది. మరోవైపు శంకర్ తన ఆస్థాన సంగీత దర్శకుడు రెహమాన్‌ను కాదని అనిరుధ్‌కు అవకాశం ఇస్తున్నట్లు కూడా సమాచారం బయటికి వచ్చింది.

కాగా ఇప్పుడు చరణ్-శంకర్ సినిమా కోసమని ఓ ముఖ్యమైన వ్యక్తిని ఎంచుకున్నట్లు సమాచారం. ఆ వ్యక్తి మరెవరో కాదు.. ప్రస్తుతం టాలీవుడ్లో నంబర్ వన్ రైటర్ అనదగ్గ సాయిమాధవ్ బుర్రా. క్రిష్ సినిమాలు కృష్ణవందే జగద్గురుం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలతో పాపులారిటీ సంపాదించి.. ఆ తర్వాత వరుసగా భారీ చిత్రాలకు పని చేస్తున్న సాయిమాధవ్‌ను చరణ్-శంకర్ సినిమాకు రచయితగా ఎంచుకున్నారట.

సామాజిక అంశాలతో ముడిపడ్డ చిత్రాల్లో సాయిమాధవ్ మాటలు ఎంత బలంగా, ప్రభావవంతంగా ఉంటాయో తెలిసిందే. శంకర్ ఎక్కువగా సొసైటీలోని పెద్ద సమస్యలను తీసుకుని.. వాటికి కమర్షియల్ టచ్ ఇస్తూ సినిమాలు తీస్తుంటారు. ఈ క్రమంలో ఆలోచింపజేసే సన్నివేశాలు పెడుతుంటాడు. మాటలు కూడా చాలా ఎఫెక్టివ్‌గా ఉండేలా చూసుకుంటాడు. సాయిమాధవ్ ఆయనకు తోడైతే ఈ టైపు కథలకు మరింత ఎలివేషన్ రావడం ఖాయం. కాబట్టి ఆయన ఈ సినిమాకు పర్ఫెక్ట్ ఛాయిస్ అని భావిస్తున్నారు.