కరోనా విరామం తర్వాత మిగతా ఇండస్ట్రీల్లో ఇప్పటికీ స్తబ్దత కొనసాగుతోంది. కొత్త సినిమాల విడుదలకు ఇంకా వెనుకడుగు వేస్తున్నారు. కొన్ని పరిశ్రమలు రీస్టార్ట్ అయినా థియేటర్లకు మునుపటిలా ప్రేక్షకులు రావట్లేదు. కానీ తెలుగు ప్రేక్షకులు అలా కాదు.థియేటర్లు తెరవడం ఆలస్యం.. కరోనా షరతుల మధ్య, 50 శాతం ఆక్యుపెన్సీలోనూ థియేటర్లకు పోటెత్తారు. ఆక్యుపెన్సీకి వంద శాతానికి పెంచాక మరింతగా సినిమాలను ఆదరిస్తున్నారు. ఇలాంటి సమయంలో మరింతగా ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేయకుండా.. వారిని నిరుత్సాహానికి గురి చేసేలా కొందరు నిర్మాతలు నిర్ణయం తీసుకుంటుండటం ఆశ్చర్యం కలిగించే విషయం.
అన్ సీజన్లో ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు రిలీజ్ చేస్తుండటంతో ప్రేక్షకులకు బోలెడన్ని ఛాయిస్లు ఉన్నాయి. అలాగే జనాలు బాగా ఓటీటీలకు కూడా అలవాటు పడ్డారు. ఈ నేపథ్యంలో థియేటర్లో వచ్చిన ప్రతి సినిమానూ చూసేయట్లేదు. ఇలాంటి సమయంలో టికెట్ల రేట్ల పెంపు వైపు కొందరు నిర్మాతలు అడుగులేస్తున్నారు. ఇప్పటికే నితిన్ సినిమా ‘చెక్’కు టికెట్ల రేట్లు పెంచి ఎదురు దెబ్బ తిన్నారు. ఆ చిత్రానికి సింగిల్ స్క్రీన్ల రేట్లను రూ.100-120 నుంచి రూ.150కి.. మల్టీప్లెక్సుల ధరల్ని రూ.150 నుంచి రూ.200కు పెంచారు. అసలే సినిమాకు టాక్ అంతంతమాత్రంగా వచ్చింది. పైగా టికెట్ల రేట్లు పెంచడంతో జనాలు మరింతగా ఆ సినిమాకు దూరం అయ్యారు. రేట్ల పెంపుతో తొలి రోజు కొంత అదనపు ఆదాయం వచ్చినా.. రెండో రోజు నుంచి అసలు ప్రేక్షకులే థియేటర్లకు రాకపోవడంతో పంచ్ పడింది.
ఈ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోకుండా మరో సినిమాకు ఇలాంటి తప్పిదమే చేస్తున్నారు. మహా శివరాత్రి కానుకగా రానున్న శర్వానంద్ సినిమా ‘శ్రీకారం’కు కూడా ఇదే తరహాలో రేట్లు పెంచేస్తున్నారట. మల్టీప్లెక్సులో సినిమా చూసొచ్చే డబ్బులతో కొన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఏడాది సబ్స్క్రిప్షన్లు వస్తున్న ఈ రోజుల్లో ఇలా రేట్లు పెంచడం ఎంత వరకు సమంజసమో నిర్మాతలే ఆలోచించాలి. అయినా బాగా డిమాండున్న భారీ చిత్రాలకు ఇలా రేట్లు పెంచడాన్నయినా అర్థం చేసుకోవచ్చు కానీ.. మీడియం రేంజ్ సినిమాలకు ఇది చేటు చేసే నిర్ణయమే. అందులోనూ విపరీతమైన పోటీ మధ్య రిలీజవుతున్న శ్రీకారం చిత్రానికి దీని వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుందేమో.