కమల్‌కు విలన్‌గా రాఘవ లారెన్స్?

లోక నాయకుడు కమల్ హాసన్ కొంత విరామం తర్వాత మళ్లీ ముఖానికి రంగేసుకున్నారు. ‘ఖైదీ’, ‘మాస్టర్’ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్‌తో ఆయన ‘విక్రమ్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు నెలల కిందటే సెట్స్ మీదికి వెళ్లింది. నెల రోజుల షెడ్యూల్లో చకచకా కొన్ని ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసిన కమల్.. ఆ తర్వాత రాజకీయాల కోసం విరామం తీసుకున్నాడు.

ఆయన పార్టీ మక్కల్ నీదిమయం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో కమల్ ప్రచారంలో బిజీ అయిపోయాడు. ఇంకో నెల రోజులు ఆయన బిజీ. తర్వాత మళ్లీ ‘విక్రమ్’ సినిమా సెట్స్ మీదికి వస్తాడు. ఈ సినిమా టీజర్ చూసినపుడే ఇది పూర్తి స్థాయి యాక్షన్ మూవీ అనే సంగతి అర్థమైంది. ఇందులో విలన్ పాత్ర హీరోకు దీటుగా ఉంటుందని, ఆ పాత్రకు రాఘవ లారెన్స్‌ పేరును పరిగణిస్తున్నారని వస్తున్న తాజా సమాచారం ఆసక్తి రేకెత్తిస్తోంది.

రాఘవ లారెన్స్ చాలా ఏళ్లుగా తాను దర్శకత్వం వహించే ‘కాంఛన’ సిరీస్ సినిమాల్లో మాత్రమే నటిస్తున్నాడు. అందులో అతడి పాత్రలు చూస్తే నెగెటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్లు కూడా బాగా చేయగలడనిపిస్తుంది. ఆ సినిమాలు చూసే ‘విక్రమ్’ సినిమాలో విలన్ పాత్రకు అతణ్ని కన్సిడర్ చేసి ఉండొచ్చు లోకేష్. లారెన్స్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు ఇంకా అధికారిక సమాచారం రాలేదు కానీ.. కమల్ హాసన్ సినిమాలో విలన్ పాత్ర అంటే అతను నో చెప్పే అవకాశం లేదు. అతడికి రజినీకాంత్ అన్నా, కమల్ హాసన్ అన్నా విపరీతమైన అభిమానం.

ఆల్రెడీ సన్ పిక్చర్స్ నిర్మాణంలో రజినీతో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు లారెన్స్ ఆ మధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లోపే కమల్ సినిమాలో అతడికి అవకాశం దక్కడం విశేషమే. మరి కమల్-లారెన్స్ మధ్య తెరపై కెమిస్ట్రీ ఎలా పండుతుందో చూడాలి. ఎన్నికల తర్వాత కమల్ ముందు ఈ సినిమాను పూర్తి చేసి ఆ తర్వాత ‘ఇండియన్-2’ను పున:ప్రారంభించనున్నాడు.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)