పవన్ 27.. ఓవర్సీస్ డీల్ డన్

రీఎంట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మామూలు ఊపులో లేడు. వరుసబెట్టి సినిమాలు చేసుకుపోతున్నాడు. ‘వకీల్ సాబ్’ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అటు ఇటుగా ఇంకో నెల రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవన్ రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్నా, రీఎంట్రీలో చేసింది మహిళల సమస్యల నేపథ్యంలో సాగే సినిమా అయినా.. ‘వకీల్ సాబ్’పై అంచనాలేమీ తక్కువగా లేవు. దానికి భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. దీని తర్వాత పవన్ నటిస్తున్న కొత్త చిత్రానికి ఇంకా పెద్ద స్థాయిలోనే బిజినెస్ ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం.

క్రిష్ లాంటి అభిరుచి ఉన్న దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తుండటం, పవన్ కెరీర్లోనే తొలిసారిగా ఓ చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా చేస్తుండటం, అలాగే దీని భారీతనం, బడ్జెట్ కూడా ఎక్కువ కావడంతో అందుకు తగ్గట్లే హైప్ కూడా ఉంది. బిజినెస్ ఆఫర్లు కూడా బాగానే ఉన్నట్లు తెలుస్తోంది.

పవన్-క్రిష్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. విడుదలకు చాలా సమయం ఉన్నప్పటికీ ఇంతలోనే కొన్ని ఏరియాలకు బిజినెస్ డీల్స్ క్లోజ్ చేసేస్తున్నారట. ఓవర్సీస్ హక్కులు ఇప్పటికే అమ్ముడైపోయినట్లు సమాచారం. ఫార్స్ ఫిలిమ్స అనే సంస్థ కమిషన్ పద్ధతిలో ఈ సినిమా హక్కులు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ముందుగా నిర్మాత ఎ.ఎం.రత్నంకు రూ.5 కోట్ల అడ్వాన్స్ చెల్లించిందట ఆ సంస్థ.

కరోనా ధాటికి ఓవర్సీస్ వ్యాపారం బాగా దెబ్బ తింది. ఇంతకుముందులా భారీ ఆఫర్లు రావట్లేదు. ఇంతకుముందు ఓకే అయిన డీల్స్ కూడా రద్దవుతున్నాయి. రేట్లు తగ్గించమని అడుగుతున్నారు. కానీ వచ్చే ఏడాది సంక్రాంతి సమయానికి పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని, అప్పటికి సినిమాలు ఒకప్పటి లాగే ఆడుతాయని ఆశిస్తున్నారు. పవన్-క్రిష్ సినిమా ఓవర్సీస్‌లోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందన్న ఆశతో ఉన్నారు.