రాజ‌శేఖ‌ర్ కూతురి త‌మిళ సినిమా

ఎన్నో ఆశ‌ల‌తో టాలీవుడ్లో క‌థానాయిక‌లుగా అరంగేట్రం చేద్దామ‌ని చూశారు రాజ‌శేఖ‌ర్ కూతుళ్లు. పెద్ద‌మ్మాయి శివాని క‌థానాయిక‌గా మొద‌లైన తొలి సినిమా మ‌ధ్య‌లోనే ఆగిపోగా.. రెండో అమ్మాయి శివాత్మిక తొలి చిత్రం దొర‌సాని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టి ఆమెకు నిరాశ‌ను మిగిల్చింది. వీళ్లిద్ద‌రూ తెలుగులో ప్ర‌స్తుతం వేరే ప్రాజెక్టుల్లో న‌టిస్తున్నారు. కాగా శివాత్మిక‌కు త‌మిళంలో ఒక పేరున్న సినిమాలో క‌థానాయిక‌గా న‌టించే అవ‌కాశం ద‌క్క‌డం విశేషం. ఆమె త‌మిళ సీనియ‌ర్ నటుడు కార్తీక్ త‌న‌యుడైన గౌత‌మ్ కార్తీక్ స‌ర‌స‌న త‌మిళంలో ఓ సినిమా చేస్తోంది.

ఆ సినిమా పేరు.. ఆనందం విల‌యాడుమ్ వీడు. ఆనందం విలసిల్లే ఇల్లు అని ఈ టైటిల్ అర్థం. పేరుకు త‌గ్గ‌ట్లే సంద‌డిగా ఉన్న ఓ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కూడా వ‌దిలారు ఈ సినిమా నుంచి. హీరోయిన్ నాయ‌క‌త్వంలో ఆడాళ్లంతా ఒక‌వైపు నిలుచుంటే.. హీరో జ‌ట్టు మ‌రోవైపు నిలిచి తాడు లాగే ఆట ఆడుతున్న దృశ్యంతో ఫ‌స్ట్ లుక్ తీర్చిదిద్దారు. ఇది పూర్తిగా గ్రామీణ నేప‌థ్యంలో సాగే సినిమా అని ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. లాంగ్ షాట్‌లో ఉన్న ఫ‌స్ట్ లుక్ కావ‌డంతో ఇందులో హీరో హీరోయిన్లు హైలైట్ కాలేదు. శివాత్మిక లంగావోణీలో సంప్ర‌దాయ బ‌ద్ధ‌మైన పాత్ర చేస్తున్న‌ట్లుంది.

త‌న కూతురు త‌మిళంలో పేరున్న హీరో ప‌క్క‌న క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అవుతుండ‌టంతో రాజ‌శేఖ‌ర్ ఎంతో ఆనందంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను షేర్ చేశారు. ఆయ‌న స్వ‌త‌హాగా త‌మిళుడే అన్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ ఇండ‌స్ట్రీలోనూ ఆయ‌న‌కు ప‌రిచ‌యాలు బాగానే ఉన్నాయి. ఆ ప‌రిచ‌యాల‌తోనే కూతురిని త‌మిళ తెర‌కు ప‌రిచ‌యం చేస్తున్నట్లున్నారు. నంద పెరియ‌స్వామి అనే ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. మ‌రి త‌మిళంలో అయినా శివాత్మిక కెరీర్‌కు శుభారంభం ద‌క్కుతుందేమో చూడాలి.