ఎన్టీఆర్ ఎంఈకే ప్రోమో రెడీ


యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరపై సందడి చేయబోతున్నట్లు బలంగానే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు ‘బిగ్ బాస్’ షో తొలి సీజన్‌ను తారక్ ఎంత బాగా నడిపించాడో.. ఆ షోకు ఎలా ఆకర్షణకు మారాడో తెలిసిందే. ఇప్పటికీ ‘బిగ్ బాస్’ ప్రియులు ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తొలి సీజన్‌ను గుర్తు చేసుకుని అతను మళ్లీ ఈ షోలో పాల్గొంటే బాగుంటుందని అనుకుంటూ ఉంటారు.

ఐతే తర్వాతి సీజన్లలోనూ ఎన్టీఆర్‌ను సంప్రదించినా అతను.. మళ్లీ ఆ షోను హోస్ట్ చేయడానికి అంగీకరించలేదు. ఐతే ఇప్పుడు మరో పేరున్న షోతో తారక్ బుల్లితెర ప్రేక్షకులను అలరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు నాగార్జున, చిరంజీవి హోస్ట్ చేసి, మధ్యలో ఆగిపోయిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో పున:ప్రారంభం కానుందని, తారక్ దాని కొత్త సీజన్‌‌ను హోస్ట్ చేయబోతున్నాడని సమాచారం.

ఇప్పటికే తారక్‌ను పెట్టి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోమోను కూడా షూట్ చేశారని, దాన్ని అతి త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. వచ్చే నెల నుంచే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కొత్త సీజన్ ఆరంభం కానుందట. తారక్ మీద ప్రోమో తీసింది అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కావడం విశేషం. ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో తారక్‌ మీద త్రివిక్రమ్ ఒక యాడ్ షూట్ చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ అది యాడ్ షూట్ కాదని.. ‘ఎంఈకే’ ప్రోమో అని అంటున్నారు.

‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోను నాగార్జున హోస్ట్ చేసినపుడు మంచి రేటింగ్సే వచ్చాయి. ఈ షో బాగానే నడిచింది. ఐతే ఉన్నట్లుండి ఆయన ఈ షో నుంచి తప్పుకున్నారు. చిరంజీవి హోస్ట్ చేసిన తర్వాత సీజన్‌కు ఆశించినంత స్పందన రాలేదు. ఐతే ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ‘బిగ్ బాస్’ నాగార్జున చేతికి వెళ్లగా.. ఇప్పుడు ‘ఎంఈకే’ తారక్ చేతుల్లోకి వచ్చిందన్న వార్త ఆసక్తి రేకెత్తించేదే. ఈ షో జెమిని టీవీలో ప్రసారం కాబోతోంది.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)