ఆఫర్స్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా ‘మహానటి’

‘మహానటి’ సినిమా తర్వాత కీర్తి సురేశ్ కెరీర్ గ్రాఫ్ మొత్తం మారిపోయింది. ‘మహానటి’ సావిత్రి పాత్రలో పరకాయప్రవేశం చేసిన కీర్తిసురేశ్ నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా దక్కింది. ఈ సినిమా తర్వాత కీర్తిసురేశ్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కవుట్ కాకపోయినా… ఆమెకు లెక్కకు మించిన ఆఫర్స్, అంతకుమించి రూమర్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి.

ప్రస్తుతం తెలుగులో ‘మిస్ ఇండియా’, ‘గుడ్‌లక్ సఖి’, ‘రంగ్ దే’ సినిమాల్లో నటిస్తున్న కీర్తిసురేశ్… కోలీవుడ్‌లో రెండు, మలయాళంలో ఓ సినిమాతో ఫుల్లు బిజీగా ఉంది. ప్రస్తుతం కీర్తిసురేశ్‌తో కలిసి ‘రంగ్ దే’ సినిమా చేస్తున్న నితిన్, తన తర్వాతి సినిమాలో కూడా కీర్తినే హీరోయిన్‌గా ఎంచుకున్నాడట.

కృష్ణచైతన్య డైరెక్షన్‌లో ‘పవర్ పేట’ అనే సినిమాను కన్ఫార్మ్ చేసిన నితిన్, ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాడు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళంలో రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. అందుకే కీర్తిసురేశ్ అయితే అక్కడ కూడా కావాల్సినంత క్రేజ్ వస్తుందని నితిన్ ఆలోచన.

ఇదేకాకుండా పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోయే చిత్రంలో కూడా కీర్తిసురేశ్‌నే హీరోయిన్‌గా అనుకుంటున్నారట. అధికారికంగా అనౌన్స్‌మెంట్ రావడమే తరువాయి అని టాక్ నడుస్తోంది. ‘మహానటి’ సినిమా తర్వాత సెట్స్‌లో కీర్తిసురేశ్ బిహేవియర్‌లో ఛేంజ్ వచ్చినా… ఆమె టాలెంట్, క్రేజ్ కారణంగా వరుస ఆఫర్స్ పట్టేస్తోందనమాట.