సౌత్ ఇండియాలో ప్రస్తుతం మాంచి ఊపుమీదున్న సూపర్ స్టార్ మోహన్ లాల్. మలయాళంలో ఒకప్పుడు మమ్ముట్టి ఆయనకు గట్టి పోటీ ఇచ్చేవాడు కానీ.. గత కొన్నేళ్లలో మాత్రం లాల్ జోరు ముందు ఆయన నిలవలేకపోతున్నారు. దృశ్యం, పులి మురుగన్, లూసిఫర్ లాంటి బ్లాక్బస్టర్లతో లాల్ రేంజే మారిపోయింది. అవి ఆయా సమయాల్లో మాలీవుడ్ ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి.
తాజాగా దృశ్యం సినిమాతో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు మోహన్ లాల్. ఈ సినిమా థియేటర్లలో రిలీజైతే మరో బ్లాక్‌బస్టర్ లాల్ సొంతమయ్యేదేమో. అమేజాన్ ప్రైమ్‌లో రిలీజైన ఈ చిత్రం అదిరిపోయే టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సమయంలోనే లాల్ ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టు చేయడానికి సిద్ధమయ్యాడు. మూడు దశాబ్దాల ఘన ప్రస్థానంలో లాల్ తొలిసారిగా దర్శకత్వం చేపట్టనున్న సినిమా ఇది కావడం విశేషం. ఆ సినిమా పేరు.. బారోజ్.
సౌత్ ఇండియాలో లాల్ స్థాయి సూపర్ స్టార్లలో ఒక్క కమల్ హాసన్ మాత్రమే దర్శకత్వం చేపట్టాడు. ఐతే కమల్ మొదట్నుంచి తన సినిమాల రచనలో కీలకంగా ఉంటూ.. చాలా ముందే మెగా ఫోన్ పట్టాడు. ఐతే తన మిత్రుడైన లెజండరీ డైరెక్టర్ ప్రియదర్శన్‌తో ఎన్నో సినిమాల కథా చర్చల్లో భాగస్వామి అయిన లాల్.. ఆ అనుభవంతో ఇప్పుడు దర్శకత్వానికి సిద్ధమవుతున్నాడు.
ఆయన తొలి ప్రయత్నంలోనే ఓ సాహసోపేత, భారీ చిత్రం తీయబోతున్నాడు. 400 ఏళ్ల ముందు వాస్కోడగామా దగ్గరున్న భారీ నిధికి కాపలాదారుగా ఉన్న బారోజ్ అనే కల్పిత పాత్ర నేపథ్యంలో లాల్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఇందులో లీడ్ రోల్ కూడా మోహన్ లాలే చేయబోతున్నాడు. ఈ చిత్రానికి లెజెండరీ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ సంతోష్ శివన్ ఛాయాగ్రహణం అందించనున్నాడు. ఆయనే బారోజ్ సినిమాతో లాల్ దర్శకుడిగా పరిచయమవుతున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు. మార్చిలో ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates