దృశ్యం-2.. ఎలా వర్కవుటవుతుందబ్బా?

దృశ్యం-2.. ఇప్పుడు భారతీయ ప్రేక్షకుల నోళ్లలో బాగా నానుతున్న సినిమా. భాషా భేదం లేకుండా ఈ సినిమాను అమేజాన్ ప్రైమ్‌లో చూస్తున్నారు జనాలు. ‘దృశ్యం’ సినిమా వివిధ భాషల్లో రీమేక్ అయి అన్ని చోట్లా మంచి ఫలితాన్నందుకోవడంతో దాని మాతృకకు సీక్వెల్ అనే సరికి సబ్ టైటిల్స్ పెట్టుకుని అందరూ ఈ సినిమా చూస్తున్నారు.

రిలీజ్ ముంగిట ఇతర భాషల వాళ్లలో ఆసక్తి తక్కువగానే కనిపించింది కానీ.. మరీ అంచనాలేమీ లేకుండా విడుదలైన ఈ చిత్రం అదిరిపోయే టాక్ తెచ్చుకోవడం, ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సీక్వెల్స్ అనిపించుకోవడంతో జనాలు దాని వైపు చూస్తున్నారు. అన్ని వైపుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో నెమ్మదిగా సినిమా చూసే వారి సంఖ్య పెరుగుతోంది.

ఇండియాలో కరోనా-లాక్ డౌన్ పుణ్యమా అని ప్రతి ఇంట్లోకీ అమేజాన్ ప్రైమ్ వచ్చేసింది. భారీగా సబ్‌స్క్రిప్షన్లు పెరిగాయి. దీంతో ఇక్కడ ఏ కొత్త సినిమా రిలీజ్ చేసినా వ్యూస్ భారీగా ఉంటున్నాయి.

ఐతే ఈ ఒరవడే ఇప్పుడు ‘దృశ్యం-2’ రీమేక్‌లకు ప్రతికూలంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. అమేజాన్ ప్రైంలో ఈ సినిమాకు రికార్డు స్థాయి వ్యూస్ వస్తాయని భావిస్తున్నారు. తెలుగు వాళ్లే కాదు.. అన్ని భాషల వాళ్లూ ఈ సినిమా చూస్తున్నారు. ఇంతగా ఆదరణ సంపాదించాక, కథేంటో తెలిసిపోయాక రీమేక్ చేసి ఏం లాభం అన్నది ఇప్పుడు ప్రశ్న. ‘దృశ్యం’ను రీమేక్ చేసినప్పటికి పరిస్థితులు వేరు. అప్పుడు ఓటీటీల జోరుండేది కాదు. ముఖ్యంగా మలయాళ సినిమాలను మనోళ్లు పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు చాలా మారిపోయాయి.
ఓటీటీల ద్వారా పెద్ద ఎత్తున మలయాళ సినిమాలు చూడ్డానికి అలవాటు పడ్డారు. పైగా ‘దృశ్యం-2’ అనేసరికి ఇంకా ఎక్కువగా చూసేందుకు ఆస్కారముంది. కథంతా తెలిసిపోయి, ఎక్కువమంది చూసేశాక ఇక్కడ రీమేక్ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కనీసం ఒరిజినల్‌తో పాటే ఇక్కడ కూడా వేగంగా చిత్రీకరణ జరిపి ఒకేసారి, లేదా తక్కువ విరామంలో రిలీజ్ చేస్తే కథ వేరుగా ఉండేది. కానీ మలయాళంలో విడుదలై మంచి విజయం సాధించాక, చాలామంది సినిమా చూసేశాక ఆర్నెల్లకు తెలుగులో రిలీజ్ చేస్తే ఎలా వర్కవుట్ అవుతుందో ఏమో?