మన తెలుగులో ఏ పాత్రనైనా చేయగల.. ఎంత కష్టమైన డైలాగ్ అయినా అలవోకగా చెప్పగల సామర్థ్యం ఉన్న నటుల్లో మోహన్ బాబు ఒకరు. ఇప్పుడు పురాణాల నేపథ్యంలో సినిమా తీసి అందులో గ్రాంథిక డైలాగులు చెప్పమంటే భయపడి పోయే ఆర్టిస్టులే ఎక్కువ. కానీ మోహన్ బాబుకు అలాంటి సంభాషణలు కొట్టిన పిండే. వేదికల మీద ఆయన తన నైపుణ్యాన్ని అప్పుడప్పడూ ప్రదర్శిస్తూ ఉంటారు.
తాజాగా ఆ చాతుర్యాన్ని లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ముందు ప్రదర్శించి ఆయన్ని భయపెట్టేశారు మోహన్ బాబు. కలెక్షన్ కింగ్ ప్రస్తుతం ‘సన్ ఆఫ్ ఇండియా’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రైటర్ టర్న్డ్ డైరెక్టర్ డైమండ్ రత్నబాబు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మంచు విష్ణు నిర్మాత. ఈ మధ్యే ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేశారు. ఇది దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమని అది చూస్తే అర్థమైంది.
తాజాగా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాటకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. దాన్ని వీడియో రూపంలో మంచు విష్ణు షేర్ చేశాడు. 11వ శతాబ్దంలో వేదాంత దేశిక శ్రీరాముని ఘనతలను అభివర్ణిస్తూ రాసిన ‘రఘువీర గద్యం’ను ‘సన్ ఆఫ్ ఇండియా’ కోసం వాడుకున్నారట. ఇందులో కథానాయకుడి ఔన్నత్యాన్ని చాటే క్రమంలో ఈ పాట వస్తుందట. ఆ పాట సాహిత్యానికి సంబంధించిన కాపీ తీసుకుని రత్నబాబుతో కలిసి మోహన్ బాబు ఇళయరాజాను కలిసిన వీడియోను విష్ణు పంచుకున్నాడు. ఆ గద్యంలోని ఎంతో కఠినమైన పంక్తులను మోహన్ బాబు.. ఇళయరాజా ముందు అలవోకగా పలుకుతుంటే ఆయన ఆశ్చర్యపోయారు. ఇంత కఠినంగా ఉందేంటి అంటూ కొంచెం కంగారు పడ్డారు కూడా.
మోహన్ బాబు ఆ పంక్తులను చదువుతూ వెళ్తుంటే మీరే ఈ పాట పాడతారా అని అడిగాడు ఇళయరాజా. ఐతే తాను డైలాగ్ బాగా చెప్పగలనని, పాట పాడలేనని అన్నారు మోహన్ బాబు. ఈ పాటను మీదైన శైలిలో కంపోజ్ చేయాలంటూ ఇళయరాజా చేతికి లిరిక్స్ కాపీ అందించారు. ఈ పాట కంపోజ్ చేయడం అంత తేలిక కాదని అంటూ ఆయన విన్నపాన్ని అంగీకరించారు.