ప్రభాస్ సినిమాకు ముందు ఇది శాంపిలా?

కేవలం రెండు సినిమాల సినిమాల అనుభవంతో ప్రభాస్‌ లాంటి పెద్ద స్టార్‌తో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు యువ దర్శకుడు నాగ్ అశ్విన్. అందులోనూ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి చిన్న సినిమాతో పరిచయం అయిన అతను… ఇంత త్వరగా ప్రభాస్‌తో మూణ్నాలుగు వందల కోట్ల సినిమా చేస్తాడని ఎవరూ ఊహించలేదు. అతడికి ఇంత పెద్ద అవకాశం రావడానికి కారణం ‘మహానటి’.

ప్రభాస్‌తో అశ్విన్ ఎలాంటి సినిమా తీస్తాడా అని ఈ చిత్రం అనౌన్స్ చేసినపుడు అందరూ ఉత్కంఠకు గురయ్యారు. అతను ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ చేయబోతున్నట్లుగా సంకేతాలు అందాయి. అది ‘ఆదిత్య 369’ తరహాలో ఉంటుందని కూడా అంటున్నారు. ఈ మధ్య ఈ సినిమా టెక్నీషియన్ల గురించి వెల్లడించిన సందర్భంగా ఈ సినిమాతో భవిష్యత్తులోకి ప్రయాణం చేయబోతున్నట్లు చెప్పడం ద్వారా ఇది ఎలాంటి చిత్రమో సంకేతాలు ఇచ్చాడు నాగి. ‘ఆదిత్య 369’లో హీరో గతంలోకి వెళ్లి వచ్చాక అనుకోకుండా భవిష్యత్తులోకి కూడా వెళ్తాడన్న సంగతి తెలిసిందే. ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమాలో ‘గతం’ ఏమీ ఉండదని.. మొత్తం భవిష్యత్ నేపథ్యంలోనే నడుస్తుందని భావిస్తున్నారు.

హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలకు దీటుగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాలని నాగి అండ్ టీమ్ కసరత్తు చేస్తోంది. ఐతే ఈ చిత్రాన్ని మొదలుపెట్టడానికి ముందు తాను ఇలాంటి సబ్జెక్టును ఎలా డీల్ చేస్తానో సంకేతాలు ఇవ్వడానికి.. తనను తాను టెస్ట్ చేసుకోవడానికి ‘పిట్టకథలు’లో ‘ఎక్స్ లైఫ్’ ఎపిసోడ్‌ను నాగి డైరెక్ట్ చేశాడేమో అనిపిస్తుంది. ఇది సైంటిఫిక్ టచ్ ఉన్న స్టోరీ. హ్యూమన్ ఎమోషన్లను టెక్నాలజీ ఎలా డామినేట్ చేస్తుందో ఇందులో చూపించారు. వర్చువల్ రియాలిటీ తర్వాత ఉన్న చోటు నుంచే ప్రపంచంలో కోరుకున్న ఎక్కడికైనా వెళ్లే అనుభవాన్ని ఇందులో డిస్కస్ చేశాడు నాగి.

ఇందులో పాత్రలు, డైలాగులు, సెట్స్ అన్నీ కూడా భవిష్యత్ దర్శనాన్ని చూపించాయి. ఐతే ఐడియా బాగున్నప్పటికీ అనుకున్నంత ఎఫెక్టివ్‌గా మాత్రం ఈ ఎపిసోడ్‌ను డీల్ చేయలేకపోయాడు నాగి. దీన్ని చూసి ప్రభాస్ సినిమా మీద సందేహాలు పెట్టుకోవాల్సిన పని లేదు కానీ.. నాగి నుంచి ప్రేక్షకులు మాత్రం బెటర్ ఔట్ పుట్ ఆశించారు. ఈ ఎపిసోడ్‌కు వచ్చే ఫీడ్ బ్యాక్‌ను బట్టి నాగి తప్పులు దిద్దుకుని ప్రభాస్ సినిమాను పకడ్బందీగా తీస్తాడని ఆశిద్దాం.