‘అ’ది తేలనే లేదు.. అప్పుడే దీని సీక్వెలట

టాలీవుడ్ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ కాన్ఫిడెన్స్ చూస్తే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంటుంది. అతడి తొలి సినిమా ‘అ!’ గురించి విడుదలకు ముందు, తర్వాత చాలానే చర్చ జరిగింది. దానికి కొన్ని అవార్డులు కూడా వచ్చాయి. కానీ కమర్షియల్‌గా అది ఏమంత పెద్ద సక్సెస్ ఏమీ కాదు. ఇక రెండో సినిమా ‘కల్కి’కి కూడా మంచి హైప్ వచ్చినా.. అది బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది.

ఐతే ఈ ఫలితాలు ప్రశాంత్ కాన్ఫిడెన్స్‌ను ఏమాత్రం తగ్గించలేకపోయాయి. వేదికల మీద మైక్ పట్టుకున్నా, ఇంటర్వ్యూలు ఇచ్చినా ఘనమైన మాటలే మాట్లాడుతుంటాడు ప్రశాంత్. సోషల్ మీడియా పోస్టులు కూడా అదే రీతిలో ఉంటాయి. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి పెద్ద పెద్ద స్టేట్మెంట్లే ఇస్తుంటాడు. ‘అ!’కు సీక్వెల్ చేయబోతున్నట్లుగా ఆ మధ్య కొంత హడావుడి చేశాడు. ఈ చిత్రానికి స్క్రిప్టు రెడీ అంటూ ఆ మధ్య ట్విట్టర్లో ఒక పెద్ద ఫైల్స్ బండిల్ పోస్ట్ చేశాడు. ఈ చిత్రం కోసం విజయ్ సేతుపతిని సంప్రదిస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి.

తీరా చూస్తే ఇప్పటిదాకా ‘అ!’ సీక్వెల్‌ ముందుకే కదల్లేదు. ఐతే ఇప్పుడు ప్రశాంత్ కొత్త సినిమా ‘జాంబి రెడ్డి’ సీక్వెల్ గురించి చర్చ నడుస్తోంది. ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది. తెలుగులో తొలి జాంబి చిత్రంగా దీనికి మంచి ప్రచారమే లభిస్తోంది. ఐతే దీని ట్రైలర్‌కు అంత మంచి స్పందనేమీ రాలేదు. మరీ గోల గోలగా ఉందని, వయొలెన్స్ బాగా ఎక్కువైందనే కామెంట్లు పడ్డాయి. మరి సినిమా ఏ మేర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుందో, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.

ఐతే సినిమా విడుదలకు ముందే ‘జాంబిరెడ్డి’ సీక్వెల్ గురించి వార్తలొస్తున్నాయి. సీక్వెల్లో సమంత ప్రధాన పాత్ర పోషించే అవకాశాలున్నాయని, ఆమెకు ప్రశాంత్ ఇప్పటికే స్క్రిప్టు కూడా చెప్పేశాడని, సామ్ సానుకూలంగా స్పందించిందని, ‘జాంబిరెడ్డి’ ఫలితాన్ని బట్టి ఆమె నిర్ణయం ఉంటుందని అంటున్నారు. ‘జాంబి రెడ్డి’కి హైప్ తేవడం కోసం ఇలాంటి లీకులిచ్చారో ఏమో తెలియదు కానీ.. ‘అ!’ విషయంలోనూ ఇలాంటి హడావుడే జరిగిన నేపథ్యంలో ముందు ‘జాంబి రెడ్డి’కి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.