అడ్డం తిరిగిన కాజ‌ల్ లైవ్ షో

స్టార్ హీరోయిన్లు వ‌రుస‌గా డిజిట‌ల్ ఎంట్రీకి రెడీ అయిపోతున్నారు. ఈ జాబితాలోకి కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా చేరిపోయింది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన వెబ్ సిరీస్‌.. లైవ్ టెలికాస్ట్. ఇండియాలో టాప్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన‌ హాట్ స్టార్ ఈ సిరీస్‌ను రూపొందించింది. కాజ‌ల్‌తో పాటు తెలుగు వారైన‌ త‌మిళ న‌టులు వైభ‌వ్, ఆనంది ఇందులో కీల‌క పాత్ర పోషించారు. త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ వెంక‌ట్ ప్ర‌భు ఈ సిరీస్‌ను తెర‌కెక్కించాడు.

ఈ సిరీస్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లే ప్రేక్ష‌కుల‌ను కొంత భ‌య‌పెట్టాయి. ఇప్పుడు ఈ సిరీస్ ట్రైల‌ర్ వ‌దిలారు. అది మ‌రింత‌గా భ‌య‌పెడుతోంది. ఇందులో కాజ‌ల్ టీవీ ఛానెల్ రిపోర్ట‌ర్ పాత్ర పోషించ‌నుంది. ఆమె ఒక బృందాన్ని వెంట బెట్టుకుని ఒక దెయ్యాల కొంప‌కు వెళ్తుంది. అక్క‌డ దె‌య్యాన్ని లైవ్‌లో క్యాప్చ‌ర్ చేసిన‌ట్లు చూపించి ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెట్టాల‌న్న‌ది కాజ‌ల్ టీం ఉద్దేశం. ఇందుకోసం ఒక సెట‌ప్ ఏర్పాటు చేసుకుంటుంది. ఒక వ్య‌క్తికి దె‌య్యం వేషం కూడా వేయిస్తుంది. కానీ వీళ్లు షో మొద‌లుపెడ‌దామ‌నుకుంటే నిజం దెయ్యాలు త‌మ షోను మొద‌లుపెడ‌తాయి. వీళ్ల ప్లాన్ తిర‌గ‌బ‌డి దెయ్యాల చేతిలో చిక్కి విల‌విల‌లాడ‌తారు. ఇక అక్క‌డి నుంచి కాజ‌ల్ అండ్ టీం ఎలా బ‌య‌ట‌ప‌డింద‌న్న‌ది మిగ‌తా క‌థ‌.

ట్రైల‌ర్లో చూపించిన క‌థ‌, స‌న్నివేశాలు ఆస‌క్తి రేకెత్తించేలాగే ఉన్నాయి. హార్ర‌ర్ కామెడీ సినిమాల‌ను ఇష్ట‌ప‌డేవాళ్ల‌కు ఈ సిరీస్ బాగానే వినోదాన్నిచ్చేలా ఉంది. వెంక‌ట్ ప్ర‌భు ఇంత‌కుముందు సూర్య‌తో మాస్ అనే హార్ర‌ర్ కామెడీ తీశాడు. అందులో బాగానే వినోదాన్ని పండించాడు. ఇప్పుడు ఈ సిరీస్‌తో ప్రేక్ష‌కులను ఎంట‌ర్టైన్ చేయ‌డానికి రెడీ అయ్యాడు. ఫిబ్ర‌వ‌రి 12న లైవ్ టెలికాస్ట్ ప్రిమియ‌ర్స్ ప‌డ‌నున్నాయి.