టాలీవుడ్లో ఒకప్పుడు బాక్సాఫీస్ వార్ ప్రధానంగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ల మధ్యే నడిచేది. ఈ నలుగురిలో ఏ ఇద్దరి సినిమాలు ఒకేసారి విడుదలైనా మజా వచ్చేది. ఎక్కువగా చిరు, బాలయ్యల మధ్య హోరాహోరీ పోరు సాగింది. అలాగే చిరు, వెంకీ మధ్య కూడా బాక్సాఫీస్ వార్‌లు తక్కువగా ఏమీ లేవు.
కలియుగ పాండవులు-చంటబ్బాయ్, రౌడీ అల్లుడు-క్షణక్షణం, ఆపద్బాంధవుడు-సుందరకాండ, మాస్టర్-పెళ్లి చేసుకుందాం, అన్నయ్య-కలిసుందాం రా.. ఇలా చిరు, వెంకీ మధ్య బాక్సాఫీస్ పోరు చాలా సార్లే నడిచింది. ఐతే చివరగా మృగరాజు-దేవి పుత్రుడు 2001లో తలపడ్డాక ఈ ఇద్దరు సీనియర్ హీరోల మధ్య బాక్సాఫీస్ వార్ చూసే అవకాశం అభిమానులకు దక్కలేదు. అప్పుడు ఆ రెండు చిత్రాలూ డిజాస్టర్లే కావడం గమనార్హం.
మధ్యలో చిరు పదేళ్లకుపైగా విరామం తీసుకోవడం, వెంకీ జోరు తగ్గిపోవడం, యంగ్ హీరోల ఆధిపత్యం పెరిగిపోవడంతో ఈ ఇద్దరు సీనియర్ హీరోల మధ్య బాక్సాఫీస్ పోరు గురించి ఎప్పుడూ చర్చ కూడా లేకపోయింది. తన రీఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150ని బాలయ్య చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణితో పోటీకి నిలిపి పైచేయి సాధించాడు చిరు. ఇప్పుడు చిరు కొత్త సినిమా ఆచార్య.. వెంకీ మూవీ నారప్పతో పోటీ పడబోతుండటం విశేషం.
రెండు దశాబ్దాల విరామం తర్వాత మళ్లీ చిరు, వెంకీ బాక్సాఫీస్ పోరును ఈ వేసవిలో చూడబోతున్నాం. ఆచార్య, నారప్ప రిలీజ్ డేట్లు ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో ప్రకటించారు. ముందు నారప్ప చిత్రాన్ని మే 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించగా.. కాసేపటికే ఆచార్యను మే 13న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటన వచ్చింది. ఒక్క రోజు వ్యవధిలో విడుదల కాబోయే ఈ రెండు చిత్రాల్లో ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి మరి.