కేజీఎఫ్‌ టు సింగరేణి కోల్‌మైన్

ప్రభాస్.. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతుండటం ఇంకా కూడా అభిమానులకు కలలా ఉంది. ‘కేజీఎఫ్’ సినిమా చూసినపుడు అందులో ‘ఛత్రపతి’ ఛాయలు కనిపించడంతో హీరో ఎలివేషన్లు ఓ రేంజిలో ఉన్న ఈ సినిమాలో యశ్ స్థానంలో ప్రభాస్ ఉంటే ఎలా ఉంటుందన్న ఊహ చాలామందిని ఎగ్జైట్ చేసింది.

ఎప్పటికైనా ప్రభాస్ లాంటి తిరుగులేని మాస్ ఇమేజ్, భారీ కటౌట్ ఉన్న హీరో ప్రశాంత్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తే అదిరిపోతుందనే ఫీలింగ్ కలిగింది. ఐతే ఈ కాంబినేషన్ ఇప్పుడిప్పుడే సాధ్యమవుతుందని ఎవరూ అనుకోలేదు. ‘రాధేశ్యామ్’ తర్వాత ప్రభాస్ ఒకటికి రెండు భారీ చిత్రాలు అనౌన్స్ చేయడమే అందుక్కారణం. మరోవైపు ప్రశాంత్ సైతం ఎన్టీఆర్‌‌తో సినిమా చేసేలా కనిపించాడు. కానీ అనూహ్యంగా వీళ్లిద్దరి కలయికలో ‘సలార్’ అనౌన్స్ కావడం, ప్రభాస్ చేయాల్సిన రెండు సినిమాల కంటే ముందు ఇది ప్రారంభోత్సవం జరుపుకుని షూటింగ్‌కు రెడీ కావడం అభిమానులకు నమ్మశక్యంగా అనిపించలేదు.

ఈ నెలలోనే ముహూర్తం పూర్తి చేసుకున్న ‘సలార్’ ఇంకొక్క రోజులోనే సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ఈ శుక్రవారమే ‘సలార్’ తొలి షెడ్యూల్‌ను మొదలుపెట్టబోతున్నారు. మూడేళ్లకు పైగా కేజీఎఫ్ బంగారు గనుల చుట్టూ తిరిగిన ప్రశాంత్.. ప్రభాస్ కోసం సింగరేణి బొగ్గు గనుల్లోకి అడుగు పెట్టబోతుండటం విశేషం. ఈ సినిమా నేపథ్యం సరిగ్గా ఇది అని తెలియదు కానీ.. తొలి షెడ్యూల్ మాత్రం బొగ్గు గనుల ప్రాంతంలో నడవనుంది. 25 రోజుల పాటు ఇక్కడ షూటింగ్ నడుస్తుందని అంటున్నారు. నేరుగా భారీ యాక్షన్ సన్నివేశంతో షూటింగ్ మొదలుపెట్టనున్నారట.

బొగ్గు గనుల్లో ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్.. పైగా ప్రశాంత్ డైరెక్షన్ అనగానే దీనిపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రభాస్‌‌కు అతను ఎలాంటి ఎలివేషన్లు ఇస్తాడా అన్న ఆసక్తి కలుగుతోంది. ఈ సినిమా పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ అనే సంకేతాలు ఫస్ట్ లుక్‌తోనే స్పష్టమైంది. ‘కేజీఎఫ్’ నిర్మాణ సంస్థ ‘హోంబలె ఫిలిమ్స్’ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా ప్రస్తుతానికి శ్రుతి హాసన్‌ పేరు వినిపిస్తోంది. విలన్ పాత్రలకు జాన్ అబ్రహాం, విజయ్ సేతుపతిల పేర్లు ప్రచారంలో ఉన్నాయి.