పిక్ టాక్: ఎంజీఆర్ దిగొచ్చాడా?


ఉన్నట్లుండి ఈ ఫొటో చూస్తే.. ఎంజీఆర్ జమానాలో తీసిందనే అనుకుంటారు. అక్కడ కనిపిస్తున్నది రియల్ ఎంజీఆర్ అనే అనిపిస్తే ఆశ్చర్యం లేదు. కానీ ఇది ‘తలైవి’ సినిమా బృందం వదిలిన స్టిల్. అక్కడ ఎంజీఆర్‌లా కనిపిస్తున్నది అరవింద్ స్వామి. బాలీవుడ్ భామ కంగనా రనౌత్ జయలలిత పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ఎంజీఆర్‌గా అరవింద్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పాత్ర కోసం అరవింద్ మేకోవర్‌కు సంబంధించిన ఫొటోలు ఇంతకుముందే కొన్ని బయటికి వచ్చాయి. ఎంజీఆర్‌కు దగ్గరగానే కనిపించాడు అందులో అతను.

కానీ ఇప్పుడు వదిలిన స్టిల్‌లో మాత్రం యాజిటీజ్ ఎంజీఆరే అన్నట్లుగా కనిపిస్తున్నాడు. మేకప్‌ మాత్రమే కాదు.. హావభావాలు కూడా అచ్చం ఎంజీఆర్ లాగే ఇచ్చాడు అరవింద్ స్వామి. ఈ ఫొటోతో తమిళ జనాలు భలేగా కనెక్ట్ అవుతున్నారు. ఎంజీఆర్‌ను ఇప్పటికీ దేవుడిలా ఆరాధించే జనాలు తమిళనాట కోట్లల్లో ఉన్నారు. వాళ్లందరూ అరవింద్ స్వామిలో ఎంజీఆర్‌ను చూసుకుంటున్నారు. జయలలిత పాత్రధారి కంగనాతో ఎంజీఆర్‌గా అరవింద్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో.. వీరి మధ్య సన్నివేశాలు ఎలా రక్తి కడతాయో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది.

జయలలిత మీద వేరే సినిమాలు కూడా వచ్చాయి. ఇంకా రాబోతున్నాయి. కానీ అన్నింట్లోకి ఎక్కువ ఆసక్తి రేకెత్తిస్తున్నది ‘తలైవి’నే. కంగనా లాంటి టాప్ బాలీవుడ్ హీరోయిన్ జయలలిత పాత్ర చేయడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అలాగే పెద్ద నిర్మాణ సంస్థలు కలిసి ఎ.ఎల్.విజయ్ లాంటి అభిరుచి ఉన్న దర్శకుడితో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించడం.. సినిమాకు సంబంధించిన ప్రోమోలు కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ‘తలైవి’ వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.